అందుకే నేను బయటకు రావడం లేదు – రోజా

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ని పల్లెత్తు మాటన్నా అంతెత్తున విరుచుకుపడేవారు రోజా. మిగతా నాయకులు స్పందించడం వేరు, రోజా ఒక్కరు స్పందించడం వేరు. విమర్శలు చేసిన వారు సైతం తలదించుకునేలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు.…

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ని పల్లెత్తు మాటన్నా అంతెత్తున విరుచుకుపడేవారు రోజా. మిగతా నాయకులు స్పందించడం వేరు, రోజా ఒక్కరు స్పందించడం వేరు. విమర్శలు చేసిన వారు సైతం తలదించుకునేలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు. పుట్టుపూర్వోత్తరాలు సైతం వెలికితీసి చాకిరేవు పెట్టేవారు.

అలాంటి రోజా చాన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు, ఏపీఐఐసీ చైర్మన్ గా మరీ ప్రెస్ మీట్లు పెట్టలేనంత బిజీగా అయితే రోజా లేరు. మరి ఆమె స్వరం ఎందుకు వినిపించడం లేదు. అటు బాబు, ఇటు పవన్, మరోవైపు బీజేపీ.. ముప్పేట దాడి చేస్తున్న వేళ రోజా ఎందుకు ప్రతిదాడికి దిగడంలేదు. దీనిపై ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మంత్రి పదవి రాకపోవడం కూడా అందుకు పరోక్ష కారణమని ఆమె మాటల్లో అర్థమవుతోంది.

“గతంలో నాకు పని ఉండేది, ఇప్పుడు జగన్ వెంట చాలామంది ఉన్నారు, మంత్రులు, అధికారులు చాలామందే విమర్శలపై స్పందిస్తున్నారు. అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను”. అంటే మంత్రి పదవి ఉంటే నేను కూడా స్పందించి ఉండేదాన్నని రోజా చెప్పకనే చెప్పారు. ఇక ప్రెస్ మీట్లకు, మీడియాకు దూరంగా ఉండటానికి మరో కారణం కూడా చెప్పుకొచ్చారు రోజా.

తను సినీ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి సహజంగా నలుగురితో కలసి ఉన్నప్పుడు మీడియావాళ్ల అటెన్షన్ తనపైనే ఎక్కువగా ఉంటుందని, అలాంటి సమయంలో అందరూ తన చుట్టూ చేరితే మిగతావాళ్లు ఫీలయ్యేవారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరూ ఏమీ అనుకోరని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సీనియర్లు, మంత్రి పదవుల్లో ఉన్నవారు తన ప్రాధాన్యం చూసి ఇబ్బంది పడతారని, అందుకే తాను మీడియా ముందుకు రావడానికి కూడా భయపడుతున్నానని చెప్పారు.

ఇక మంత్రి పదవి రాకపోవడంపై కూడా రోజా స్పందించారు. పదవులకు ఆశపడలేదు కానీ, పదవి రాకపోవడంతో అభిమానులు, తెలిసినవాళ్లు మీకెందుకు పదవి రాలేదంటూ చేస్తున్న పరామర్శల వల్ల ఇబ్బంది పడ్డానని అన్నారు. తనతో పాటు పార్టీ వాయిస్ బాగా వినిపించిన అంబటి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారికి కూడా పదవులు రాకపోవడం ఆశ్చర్యమే అయినా, వివిధ రకాల కారణాల వల్ల అది సాధ్యం కాలేదని వివరణ ఇచ్చారు. మంత్రి పదవి దక్కాలంటే ఓన్లీ టాలెంట్ మాత్రమే సరిపోదని ముక్తాయించారామె.

మొత్తమ్మీద రోజా మాటల్లో అసంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరి రెండో దఫా అయినా రోజాకి కేబినెట్ లో బెర్త్ దక్కుతుందా..? సెకెండ్ ఇన్నింగ్స్ లోనైనా రెబల్ రోజాను చూడగలుగుతామా..? వేచి చూడాలి.