బాబు అరెస్ట్… సంబరాలు చేసుకుంటున్నారు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు జరగడం వైసీపీ నేతలకు ఖుషీగా ఉంది. ఎంతలా అంటే అంతా కలసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైసీపీ ప్రెసిడెంట్, పాడేరు ఎమ్మెల్యే…

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు జరగడం వైసీపీ నేతలకు ఖుషీగా ఉంది. ఎంతలా అంటే అంతా కలసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైసీపీ ప్రెసిడెంట్, పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి ఆద్వర్యంలో పార్టీ కార్యకర్తలు అంతా కలసి స్వీట్లు కూడా తినిపించుకున్నారు.

ఇన్నాళ్ల‌కు చంద్రబాబు అరెస్ట్ అయ్యారని వైసీపీ నేతలు అంటున్నారు. బాబు ఎన్ని తప్పులు చేసినా చట్టాలు చూస్తూ ఊరుకుంటాయనుకోవడం పొరపాటని అందుకే ఈ అరెస్ట్ అని అంటున్నారు. బాబుని అరెస్ట్ చేయడం నిజమైన చర్యగా కూడా ఎమ్మెల్యే అంటున్నారు. అవినీతి చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు సంబరాలలో మునిగితేలడం విశేషం.

వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం బాబు అరెస్ట్ ని సమర్ధించారు. ప్రభుత్వంలో ఉన్నపుడు అవినీతికి పాల్పడితే ఇలాంటివే జరుగుతాయని బొత్స అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని, చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు.

బాబు అరెస్ట్ అయిన తీరు సక్రమమే అన్నారు. అరెస్ట్ తీరుని ప్రతిపక్షాలు తప్పు పట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్ ని పద్ధతిగానే పోలీసులు చేశారని అన్నారు. మరో వైపు వైసీపీ నేతలు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ అనడం తప్పని అన్నారు. ఎవరినైనా అలా అక్రమంగా అరెస్ట్ చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా అని నిలదీశారు. ఆధారాలు కచ్చితంగా ఉండబట్టే బాబు అరెస్ట్ జరిగింది అని వారు అంటున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అవలేదు అని ఎపుడూ తమ్ముళ్లు అంటూంటారు. ఇపుడు ఆయన్ని అరెస్ట్ చేసి చూపించడంతో వైసీపీ శ్రేణులైతే ఉత్సాహంగా ఉన్నాయి. అరెస్ట్ ఎవరైనా కావాల్సిందే. బాబు అతీతుడు కాడు అన్నది రుజువు అయింది అంటూ  టీడీపీకి గట్టిగా కౌంటర్లేస్తున్నారు.