జగన్ తో వంశీ భేటీ.. నెక్ట్స్ స్టెప్ ఏంటి?

అసెంబ్లీ సమావేశాల ముందే తన భవిష్యత్ పై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీతో అనుబంధం తెగిపోయింది, వైసీపీతో బంధం మొదలుకావాల్సి ఉంది. ఈ సంధి కాలంలో టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో…

అసెంబ్లీ సమావేశాల ముందే తన భవిష్యత్ పై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీతో అనుబంధం తెగిపోయింది, వైసీపీతో బంధం మొదలుకావాల్సి ఉంది. ఈ సంధి కాలంలో టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వంశీ కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయన సీఎం జగన్ ని కలవడం రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు తావిచ్చింది.

టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ, కొద్ది సేపటి కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. మంత్రి కొడాలి నానిని వెంటబెట్టుకుని మరీ జగన్ ను కలిశారు వంశీ. తన రాజీనామా అంశంపై దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు. జగన్ తో కలిసి నడుస్తున్నానని, ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. వంశీపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఇతర పార్టీల్లో గెలిచిన వారెవరైనా వైసీపీలోకి రావాలనుకుంటే పార్టీతో పాటు, పదవులకి కూడా రాజీనామాలు చేయాలని జగన్ ఇప్పటికే కండిషన్ పెట్టారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారాయన. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పరిస్థితేంటి? ఉపఎన్నిక వస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు వంశీ.

ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గే రకం కాదు జగన్. కాబట్టి వంశీ విషయంలో ఆయన తన నియమాన్ని పక్కనపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అయినా, మరెవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి రావాలి. తను అందుకు సిద్ధమేనని వంశీ కూడా ఇప్పటికే స్పష్టంచేశారు. కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన తర్వాత తన పరిస్థితేంటనే విషయంపై జగన్ తో వంశీ చర్చించినట్టు తెలుస్తోంది.

తిరిగి అదే స్థానంలో వైసీపీ టికెట్ పై తనను పోటీ చేయిస్తారా లేక, వైసీపీ పార్టీలో వారికి అవకాశం ఇచ్చి, తనకు ప్రత్యామ్నాయం చూపిస్తారా అనే విషయంపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు వంశీ. అయితే జగన్ ని నేరుగా టికెట్ విషయంపై వివరణ అడిగే ధైర్యం చేయలేకపోయారట. నమ్మి పార్టీలోకి వచ్చిన వారెవ్వరికీ జగన్ ఇప్పటివరకూ అన్యాయం చేయలేదు. ఆ నమ్మకం ఉంది కాబట్టే అన్-కండిషనల్ గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారేందుకు కూడా వంశీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు వంశీ తన పదవికి రాజీనామా చేయకుండానే, వైసీపీకి అనుబంధ సభ్యుడిగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎంపీ బుట్టా రేణుక ఇలానే వ్యవహరించిన విషయాన్ని వాళ్లు గుర్తుచేస్తున్నారు. ఒకవేళ, వంశీ ఇలా మధ్యేమార్గాన్ని ఎంచుకుంటే, ఆ దారిలో మరింత మంది టీడీపీ నేతలు నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ మధ్యేమార్గానికి కూడా జగన్ అంగీకరించాలి. అందుకే ఈ చర్చ.