అజిత్ పవార్ రాజీనామా చేసిన గంట సేపటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా అంశాన్ని మీడియా ముందుకు వచ్చి ఆయన ప్రకటించారు. నాటకీయ పరిణామాల మధ్యన దేవేంద్రఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి పాలన సాగుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు ప్రధాన మంత్రి విశేష అధికారాలను ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. అయితే ఆ ప్రభుత్వానిది మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. అజిత్ పవార్ ను నమ్ముకుని ఏర్పాటు అయిన ఈ ప్రభుత్వం కుప్ప కూలింది. బలపరీక్షను ఎదుర్కొనాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించగానే..చకచకా రాజీనామాలు చేసేశారు ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి!
తమకు ప్రస్తుతం బలం లేదని అందుకే తను రాజీనామా చేసినట్టుగా ఫడ్నవీస్ ప్రకటించుకున్నారు! మరి బలం లేదనే అంశం ఫడ్నవీస్ కు ఇప్పుడే తెలిసిందా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉన్న బలం ఏమిటి? ఇప్పుడు లేకుండా పోయిన బలం ఏమిటో మరి!
ఇక ఫడ్నవీస్ రాజీనామాతో మహారాష్ట్రలో కథ మళ్లీ మొదటకు వచ్చింది. అయితే ఈ సారి కొంత స్పష్టత గోచరిస్తూ ఉంది. బీజేపీ తన అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు గవర్నర్ తప్పనిసరిగా అయినా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉద్ధవ్ ఠాక్రేను ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, రాబోయే ఐదేళ్లూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని రౌత్ ప్రకటించారు. మొత్తానికి శివసేన తను అనుకున్నది సాధిస్తూ ఉంది. అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ వంటి సహజమిత్రులకు తోడు వీరికి భిన్నమైన శివసేనతో ఈ కిచిడీ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. దీని కథలు ఎలా ఉంటాయో!