ఏయూలో గప్ చుప్ గా బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం

విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడంతో అగ్గి రాజుకుంది. ప్రధాని మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నపుడు నాడు జరిగిన గోద్రా అల్లర్ల మీద బీబీసీ ఈ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ…

విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడంతో అగ్గి రాజుకుంది. ప్రధాని మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నపుడు నాడు జరిగిన గోద్రా అల్లర్ల మీద బీబీసీ ఈ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ని దేశంలో ఎక్కడా ప్రసారం కాకుండా కేంద్రం నిషేధించింది.

అయినా సరే దేశంలో ప్రతీ యూనివర్శిటీలో ప్రగతిశీల విద్యార్ధి సంఘాలు ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. తెలంగాణాలో ఉస్మానియాలో డాక్యుమెంటరీ ప్రదర్శనను ఏబీవీపీ అడ్డుకుంది. ఏ హడావుడి లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏయూలో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

దీని మీద ఏబీవీపీ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీబీసీ డాక్యుమేంటరీని ఏయూలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్ధులు ప్రదర్శించడం దారుణం అని తప్పు పట్టింది. చదువుల తల్లి నిలయంలో సమాజ వ్యతిరేక బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడం దారుణం అని ఏబీవీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

చారిత్రాత్మకమైన విశ్వవిద్యాలయం ఏయూలో ఇలాంటి చర్యలను తాము ఖండిస్తున్నామని దీని మీద ఆందోళన చేస్తామని అంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కొంతమంది ప్రొఫెసర్లు కూడా మద్దతు ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు. ఈ ఘటన మీద విచారణ జరిపించాలని, ఎవరు బాధ్యులో తేల్చాలని ఏయూ వీసీ రాష్ట్ర ప్రభుత్వం సంఘ వ్యతిరేక శక్తుల పట్ల ఉక్కు పాదం మోపాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

ఏబీవీపీ ఆగ్రహం ఎలా ఉన్నా చాలా గప్ చుప్ గా బీబీసీ డాక్యుమెంటరీని శుక్రవారం రాత్రి ప్రదర్శించడం చూసేయడం జరిగిపోయాయి. దీంతో ఏబీవీపీ తో పాటు బీజేపీ కూడా ఏయూ యాజమాన్యం మీద గుర్రుమంటోంది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం వల్లనే ఇదంతా వచ్చిందని, అలా వదిలేస్తే ఎవరైనా చూస్తారు. ఎవరి అభిప్రాయాలు వారు ఏర్పరచుకుంటారు అని మేధావులు అంటున్నారు. మూసి ఉంచితేనే ఉత్కంఠ రేగుతుందని, ఇది మరింతగా రాజుకుంటుందని అంటున్నారు. ఏయూలో వామపక్ష విద్యార్ధి సంఘాలకు బలం ఎక్కువగా ఉండడం వల్లనే ఇది సాధ్యపడింది అని అంటున్నారు.