చంద్రబాబునాయుడికి రాజధాని అమరావతి ఉసురు తగిలిందా? అంటే…ఔనని ఆ ప్రాంత రైతులు అంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. చంద్రబాబు పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని కొన్ని వర్గాల ప్రజలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో అమరావతి రైతుల మనోభావాలు టీడీపీకి షాకింగ్ అని చెప్పక తప్పదు. ముమ్మాటికీ తమకు చంద్రబాబునాయుడు అన్యాయం చేయడం వల్లే ఈ వేళ ఫలితాన్ని అనుభవిస్తున్నారని వారు అంటున్నారు. తమ ఆగ్రహానికి దారి తీసిన పరిస్థితిని కూడా వారు వివరిస్తున్నారు.
పరిపాలన రాజధానిని అమరావతి నుంచి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండో దఫా రాజధాని నుంచి అరసవెల్లి వరకూ గత ఏడాది మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ పాదయాత్ర డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలోని చోడవరంలో అర్ధంతరంగా ఆగిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు 600 మంది మాత్రమే అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేయాల్సి వచ్చింది. పాదయాత్ర చేస్తున్న వారి ఆధార్ కార్డు చూపాలని పోలీసులు అడగడంతో వివాదం తలెత్తింది. ఆధార్ కార్డులను చూపలేక పాదయాత్రను నిలిపివేశారు.
తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు అమరావతి జేఏసీ ఆలోచించినా, చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే జనవరిలో లోకేశ్ పాదయాత్ర మొదలు పెడతారని, రెండింటికి ఖర్చు పెట్టలేనని ఆయన తెగేసి చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అరసవెల్లి వరకు సాగాల్సిన పాదయాత్ర లోకేశ్ పాదయాత్ర కోసం ఆగిపోయిందనే ఆవేదన అమరావతి రైతుల్లో వ్యక్తమైంది.
తాజాగా అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయిన సమీపంలోనే లోకేశ్ పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్‌తో నిలిచిపోయిందని సమాచారం. కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలవాడలో లోకేశ్ పాదయాత్ర ప్రస్తుతానికి ఆగిపోయింది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే లోకేశ్ నిరసన తెలిపారు. అనంతరం తన తండ్రిని చూడడానికి బయల్దేరిన లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని రాజోలు సీఐ గోవిందరాజుతో లోకేశ్ వాగ్వివాదానికి దిగారు.
విధి రాత అంటే ఇదే అని అమరావతి రైతులు అంటున్నారు. గతంలో తామెక్కడైతే ఆగిపోయామో అక్కడే లోకేశ్ అడుగులు ముందుకు పడని పరిస్థితిని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి కల్పించారని అమరావతి రైతులు అంటున్నారు. ఇదే దేవుడు రాత అంటే అని వారు చెబుతున్నారు.