కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు దర్శకుడు శంకర్. కమల్ హాసన్ హీరోగా ఇండియన్-2 మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ స్టార్ట్ చేశాడు. ముందుగా గేమ్ ఛేంజర్ పూర్తి చేస్తాడని అంతా అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా అదే భావించాడు.
కానీ ఇండియన్-2 మరోసారి తెరపైకొచ్చింది. ఆ సినిమాను కూడా పూర్తిచేయాల్సిన అవసరం ఏర్పడింది శంకర్ కు. దీంతో రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా చేస్తున్నాడు శంకర్. కొన్ని రోజులు ఇండియన్-2, మరికొన్ని రోజులు గేమ్ ఛేంజర్ కు కేటాయిస్తూ షూటింగ్స్ కొనసాగించాడు.
ఇప్పుడీ రెండు సినిమాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. అయితే ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. వీటిలో ఏ సినిమా ముందు రిలీజ్ అవ్వాలి?
మొన్నటివరకు ఇండియన్2 సినిమానే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే, గేమ్ ఛేంజర్ రిలీజ్ కు సంబంధించి నిర్మాత దిల్ రాజు చాలా క్లియర్ గా ఉన్నాడు. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే విడుదల తేదీ వెల్లడిస్తానని ప్రకిటంచాడు. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మారేలా కనిపిస్తున్నాయి.
ఇండియన్2 సినిమాను ఇండిపెండెన్స్ డేకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. సినిమా కథకు, ఈ సందర్భానికి సరిగ్గా సింక్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే.. ఇండియన్-2 కంటే ముందే గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
కమల్ హాసన్ సినిమా రిలీజయ్యేంతవరకు గేమ్ ఛేంజర్ కు తన దగ్గర ఉంచుకోడు దిల్ రాజు. ఇంకా చెప్పాలంటే, ఇండియన్-2తో దిల్ రాజుకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇంకా లేట్ చేయాలనుకోవడం లేదు నిర్మాత.
సో.. ఇండియన్-2 కంటే ముందే గేమ్ ఛేంజర్ రిలీజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అటు చరణ్ కూడా వీలైనంత త్వరగా శంకర్ సినిమా పూర్తిచేసి, నెక్ట్స్ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మారిన లెక్కల ప్రకారం, గేమ్ చేంజర్ ముందుగా థియేటర్లలోకి వస్తుంది, ఆ తర్వాత ఇండియన్-2 రిలీజ్ అవుతుంది. రెండూ 2024లోనే థియేటర్లలోకి వస్తాయి.