మోడీపై విల‌క్ష‌ణ న‌టుడి వ్యంగ్యాస్త్రాలు

ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ముందుంటారు. ఇటీవ‌ల “మా” ఎన్నిక‌ల్లో త‌ల‌మున‌క‌లై త‌న స‌హ‌జ ధోర‌ణిలో రాజ‌కీయాల‌పై స్పందించ‌డం త‌గ్గించ‌డాన్ని చూడొచ్చు. మ‌ళ్లీ ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌పై త‌న‌దైన విమ‌ర్శ‌నాత్మ‌క…

ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ముందుంటారు. ఇటీవ‌ల “మా” ఎన్నిక‌ల్లో త‌ల‌మున‌క‌లై త‌న స‌హ‌జ ధోర‌ణిలో రాజ‌కీయాల‌పై స్పందించ‌డం త‌గ్గించ‌డాన్ని చూడొచ్చు. మ‌ళ్లీ ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌పై త‌న‌దైన విమ‌ర్శ‌నాత్మ‌క ధోర‌ణిలో సెటైర్స్ విసిరారు.

ఇటీవల సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు. అంతేకాదు, దేశ వ్యాప్తంగా రైతాంగానికి ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల‌త ఎదుర‌వుతుంద‌నే భ‌యంతోనే ప్ర‌ధాని వెనక్కి త‌గ్గార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. 

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని నిర్ణ‌యంపై తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న మార్క్ పంచ్‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే ఉద్య‌మంలో అసువులు బాసిన ప్ర‌తి రైతు కుటుంబానికి త‌న రాష్ట్రం త‌ర‌పున రూ.3 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం త‌న వంతు బాధ్య‌త‌గా రూ.25 ల‌క్ష‌లు చెల్లించాల‌ని కేసీఆర్ డిమాండ్ చేసి… మోడీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశారు.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ సాయంపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డంతో పాటు అభినందించారు. ఈ ప‌రంప‌ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ కూడా కేసీఆర్‌ను అభినందించ‌డంతో పాటు మోడీని నిల‌దిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

‘ప్రియమైన ప్రధాని మోదీ గారూ.. క్షమాపణలు ఒక్కటే సరిపోవు. ఆ రైతుల కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ విధానాల‌ను తూర్పార ప‌ట్టే ప్ర‌కాశ్‌రాజ్ …సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్‌పై ఉద్య‌మిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాల బాధ్య‌త మీరు తీసుకుంటారా? లేదా? అని మోడీని నిల‌దీయ‌డంపై నెటిజ‌న్ల నుంచి భిన్న కామెంట్స్ వ‌స్తున్నాయి.