మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయాలు, పదవి తర్వాతే, ఎవరైనా, ఏమైనా. ఇందులో బంధుత్వాలు, అనుబంధాలకు తావులేదని అనేక సందర్భాల్లో ఆయనే నిరూపించారు. చంద్రబాబు రాజకీయ పంథాను మొదటి నుంచి పరిశీలిస్తే…ఇదే విషయం ఎవరికైనా అర్థమవుతుంది. వెండితెరపై ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నటుడైతే, రాజకీయ తెరపై ఆ బిరుదు చంద్రబాబు సొంతం చేసుకున్నారు.
ఇదేమీ బాబుపై విమర్శగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకంటూ కొన్ని లక్ష్యాలను ఆయన నిర్దేశించుకున్నారు. వాటిని సాధించుకోడానికి, నిలుపుకోడానికి చంద్రబాబు తన హృదయంలో అనుబంధాలు, ఆత్మీయతలకు చోటు లేదని తన చర్యల ద్వారా చెప్పకనే చెప్పారు.
ఒకవేళ వుంటే గింటే… అవన్నీ తన ప్రయాజనాలను కాపాడుకోడానికే అని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసే క్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలను వాడుకున్న తీరు బహిరంగ రహస్యమే. మొన్న అసెంబ్లీలో భువనేశ్వరి ఎపిసోడ్‌లో కూడా మళ్లీ ఎన్టీఆర్ కుటుంబాన్ని ముందుకు తీసుకు రావడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే తెలిసిన నైపుణ్యం. నిజంగా చంద్రబాబును అభినందించకుండా ఉండలేం. ఆయనలా రాజకీయాలు చేయడం చేతకాని వాళ్ల విమర్శలే తప్ప, ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
భువనేశ్వరిపై వైసీపీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని, అవి తనను హర్ట్ చేశాయని చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయమై బహుశా శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ చర్చకు పట్టు పట్టే అవకాశాలు లేకపోలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో విష్ణుచక్రాలు, బొంగరాలు తిప్పిన గొప్ప నాయకుడికి జరిగిన పరాభవంపై దేశ అత్యున్నత చట్ట సభల్లో చర్చ జరగకపోతే ఆశ్చర్య పడాలే తప్ప, జరిగితే కాదు.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి అనునయించినట్టు ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందిన చంద్రబాబు ఎంతో అదృష్టవంతుడు.
‘దిగజారిన మనుషులు ఏవో మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి. రాజకీయాల్లో ఒక్కోసారి ఇటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారు(ఎన్టీ రామారావు) ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆయనను ఉద్దేశించి ఇలాగే నీచంగా మాట్లాడేవారు. మనసుకు బాధ కలిగినా వాటిని వెనక్కినెట్టి మన పని మనం చేసుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టడానికే ఇలా మాట్లాడుతుంటారు. వారిని పట్టించుకోవద్దు’ అని చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి ఓదార్చినట్టు చెబుతున్నారు.
కనీసం తన సతీమణి చెప్పిన తర్వాతైనా… ఆమె పేరుతో రాజకీయ చర్చ, రచ్చలకు చంద్రబాబు ఫుల్‌స్టాప్ పెడతారని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ఆశిస్తున్నారు. కాదు, కూడదు… ఇంకా రాజకీయంగా తగిన మైలేజీ రాలేదని భావిస్తే మాత్రం భువనేశ్వరి పేరుతో పబ్బం గడుపుకుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఆమె గురించి ఎక్కడా చర్చకు అవకాశం లేకుండా చేయడం… ఒక్క చంద్రబాబు చేతిలో మాత్రమే వుంది. ఎందుకంటే ఆ రచ్చ చేస్తున్నది చంద్రబాబే కాబట్టి. భువనేశ్వరి మాటలను ఏ మాత్రం చెవికెక్కించుకుంటారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.