మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరిపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే విషయమై డ్రామా కొనసాగుతోంది. ఒకవైపు తాము భువనేశ్వరిని ఏమీ లేదని అధికార పార్టీ పదేపదే చెబుతున్నప్పటికీ… టీడీపీ మాత్రం రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు ముందుకెళుతోంది. ఏనాడూ రాజకీయాల్లో లేని భువనేశ్వరిని రచ్చకీడ్చి టీడీపీ తన దిగజారుడుతనాన్ని మరోసారి రుజువు చేసుకుంది.
ఈ నేపథ్యంలో నారావారి వెండితెర హీరో రోహిత్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. చిత్తూరు జిల్లా నారావారిపల్లోలో చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా ఖర్జూరనాయుడు, అమ్మణమ్మ సమాధుల వద్ద రోహిత్ నిరసన తెలపడం గమనార్హం. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు కుమారుడే రోహిత్. తమ పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేశ్ క్రమశిక్షణకు మారుపేరని టీడీపీ కేడర్ కు ఆదర్శంగా నిలిచినట్టు రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నాడు. ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదన్నాడు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం తన పెద్దమ్మది అని రోహిత్ తెలిపాడు. అలాంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదని నారా రోహిత్ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించాడు.
తన పూర్వీకుల సమాధుల వద్ద నిరసన తెలపాలనేది రోహిత్‌కు వచ్చిన ఆలోచనో లేక మరేతర ప్రోద్బలమో అనే చర్చ జరుగుతోంది. తమకు సంబంధం లేదని వైసీపీ ప్రజాప్రతినిధులు చెబుతుంటే, దాన్నే పట్టుకుని టీడీపీ రాద్ధాంతం చేయడం దేనికి సంకేతం? భువనేశ్వరి గౌరవ మర్యాదలను బజారుకీడుస్తోంది టీడీపీనా, వైసీపీనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ నటనేదో వెండితెరపై చేసి వుంటే రోహిత్ ఈ పాటికి మంచి పొజీషన్లో ఉండేవాడని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వాళ్ల జాబితా తెప్పించుకుని, అక్కడ కూడా ఒకసారి రోహిత్ దీక్షకు దిగితే బాగుంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.