ఏపీలో ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు అయ్యాయా అంటే ఎవరూ అంత ఈజీగా నమ్మలేరు. ఎందుకంటే ఎన్నికల్లో వైసీపీ గెలిచిన రోజు నుంచి మొదలుపెడితే టీడీపీ అలా వేడిని రగిలిస్తూనే ఉంది. ప్రతీ రోజూ సీఎం ని దిగిపోమ్మనే టీడీపీ అధినాయకత్వంతో సహా తమ్ముళ్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా అసెంబ్లీ ఎపిసోడ్, చంద్రబాబు మీడియా ముందు కన్నీళ్ళు తరువాత చంద్రబాబు మాట పక్కన పెడితే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే పదే ఒక మాట అంటున్నారు. ఈ సర్కార్ పని అయిపోయింది అని. మీకు ఇక రెండున్నరేళ్ళే టైమ్ ఉంది అంటున్నారు అచ్చెన్న.
తాజాగా ఆయన అదే స్టేట్మెంట్ రిపీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్ అరెస్ట్ నేపధ్యంలో మీరు ఈ మధ్యలో ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా వచ్చేది మేమే అంటూ మరోసారి పాత డైలాగు వల్లె వేశారు.
ఇంకో వైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్సీల నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో మరో నాలుగు పర్యాయాలు అంటే కచ్చితంగా ఇరవై ఏళ్ల పాటు జగనే సీఎం ఉంటారని గట్టి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు డ్రామాలకు ఆస్కార్ అవార్డులు ఇవ్వవచ్చు అంటూ ఆయన సెటైర్లు వేశారు. రాజకీయ నాయకులను కూడా ఈ కేటగిరీలో చేర్చితే ఆస్కార్ అవార్డులు అన్నీ బాబుకే అంటూ విజయసాయిరెడ్డి మాట్లాడారు.
మొత్తానికి జగన్ని ఓడించలేమని తెలిసే ఈ ఏడుపులు అంటూ ఆయన లాజిక్ పాయింట్ తీశారు. మొత్తానికి ఎన్నికలు చాలా దూరంలో ఉండగానే టీడీపీ బాబు కన్నీటితో పడవలేసుకుని పండుగలు చేసుకుంటోందని వైసీపీ నుంచి హాట్ హాట్ గా కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.