ఆ బిల్లులను ఎన్నేళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి?

తెలంగాణా ప్రజలకు వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఒక హామీ ఇచ్చింది. ఏమిటా హామీ? కరోనా బాధితులు ఆసుపత్రుల బిల్లులను జాగ్రత్తగా పెట్టుకోవాలని, వైఎస్సార్ టీపీ అధికారంలోకి రాగానే ఆ బిల్లులను క్లియర్ చేస్తామని…

తెలంగాణా ప్రజలకు వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఒక హామీ ఇచ్చింది. ఏమిటా హామీ? కరోనా బాధితులు ఆసుపత్రుల బిల్లులను జాగ్రత్తగా పెట్టుకోవాలని, వైఎస్సార్ టీపీ అధికారంలోకి రాగానే ఆ బిల్లులను క్లియర్ చేస్తామని చెప్పింది. అంటే కరోనా చికిత్స కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పడమన్న మాట. 

ఎందుకో షర్మిలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తానని, అధికారంలోకి వస్తానని గుడ్డి నమ్మకం. ఆమె పార్టీ పెట్టింది అధికారంలోకి రావడం కోసమే. అందులో తప్పులేదు. తాను అధికారంలోకి వస్తానని నమ్మకంగా చెప్పడానికి తనకు ఉన్న కారణాలేమిటో చెప్పగలదా?

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వస్తానని కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకు ఒక కారణముంది. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్న మాట. కానీ రాలేదు. తెలంగాణా కోసం పోరాడిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 

నిజానికి టీఆర్ఎస్ ఒక్కటే ఏమీ పోరాడలేదు. అన్ని పార్టీలూ పోరాడాయి. కానీ తెలంగాణా సాధించామంటూ టీఆర్ఎస్ తెలివిగా ప్రజలను నమ్మించి క్రెడిట్ కొట్టేసింది. తెలంగాణా వచ్చాక అధికారంపై బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఆ పార్టీ తెలంగాణా ఏర్పాటుకు సహకరించింది. కానీ దాని ఆశలు కూడా నెరవేరలేదు. రెండుసార్లూ గులాబీ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. 

ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ అధికారం కోసం అల్లాడిపోతున్నాయి. భోరుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ప్రజలు గ్యారంటీగా ఓడిస్తారని, తాము అధికారంలోకి రావడం తథ్యమని కాంగ్రెస్, బీజేపీ నమ్ముతున్నాయి. మరి జనం ఏం నిర్ణయిస్తారో చెప్పలేం. ఆ రెండు పార్టీలకు దశాబ్దాల చరిత్ర ఉంది. అధికారంలోకి వస్తామని నమ్మకం పెట్టుకోవడానికి కారణాలు ఉన్నాయి. పోరాటాల చరిత్ర కూడా ఉంది. రెండు పార్టీలకు క్యాడర్ ఉంది. కానీ ఇన్ని కారణాలు, ఇన్ని ప్లస్ పాయింట్లు, ఇంత చరిత్ర షర్మిల పార్టీకి లేవు. అది ఆమె గుర్తించాలి. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ తో గెలుస్తానంటే అది సాధ్యమా ?

కేసీఆర్ రాజకీయాల ముందు కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలే సరిపోవడం లేదు. అటువంటిది బయటి నుంచి వచ్చిన షర్మిల రాజకీయాలు పనిచేస్తాయా ? వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే ఆయన ఇమేజ్ ను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని జగన్ ఆశించాడు. వారసత్వంగా ఆ పదవి తనకు రావాలని అనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. 

రాష్ట్రం విడిపోయాక కొత్త ఏపీకి మొదటి సీఎం తానే కావాలనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. చివరకు చంద్రబాబు వైఫల్యాలు, తన సొంత మీడియా తోడ్పాటు, బాబుకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడం, ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం… ఇలాంటి కారణాలవల్ల జగన్ అధికారంలోకి రాగలిగాడు. ఈ కారణాలు కూడా ఇప్పటికిప్పుడు షర్మిలకు లేవు.

ముఖ్యంగా ఏపీలో మాదిరిగా కాకుండా తెలంగాణలో ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన పార్టీలు అంతో ఇంతో బలంగా ఉన్నాయి. ప్రజలు సహజంగానే టీఆర్ఎస్ తరువాత ఆ రెండు పార్టీల వైపే చూస్తారు. ఇలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లోనే జనం షర్మిలకు అవకాశం ఇస్తారా ? ఆమె వ్యూహకర్తను పెట్టుకోవచ్చుగాక. కానీ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి కదా.

వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు షర్మిలకు అనుకూలంగా ఉంటాయని అనుకోలేం. ఏ కోణంలో చూసినా అందుకు అవకాశాలు లేవు. కాబట్టి కరోనా బాధితులు తమ మెడికల్ బిల్లులను ఎన్నేళ్ళని దాచుకుంటారు?