బీజేపీకి ఝలక్ ఇచ్చేలా సుప్రీం వ్యాఖ్యలు!

'ప్రభుత్వ బలం తేలాల్సింది రాజ్ భవన్లో కాదు… అసెంబ్లీలో..' అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం భారతీయ జనతా పార్టీకి ఝలక్ అని అంటున్నారు  పరిశీలకులు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడటంపై విపక్షాలు సుప్రీం కోర్టును…

'ప్రభుత్వ బలం తేలాల్సింది రాజ్ భవన్లో కాదు… అసెంబ్లీలో..' అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం భారతీయ జనతా పార్టీకి ఝలక్ అని అంటున్నారు  పరిశీలకులు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడటంపై విపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్రజాస్వామ్యికంగా ఈ ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు వాదిస్తూ ఉన్నాయి. వారి తరఫు న్యాయవాది  ఈ మేరకు వాదనలు వినిపించారు.

ఆదివారం కూడా ఇందుకు సంబంధించి వాదనలు జరిగాయి. సోమవారం జరిగిన వాదనల సందర్భంగా కోర్టు ఆసక్తిదాయక మైన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఇరవై నాలుగు గంటల్లో విశ్వాస పరీక్ష జరగాలన్నట్టుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ మనుగడకు సంబంధించి బలాబలాలను రాజ్ భవన్ తేల్చేయలేదని సుప్రీం వ్యాఖ్యానించడమే మరింత ఆసక్తిదాయకమైన అంశం.

ఇప్పటి వరకూ ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ అధికారాలే కనిపిస్తాయి. మొదట ప్రభుత్వ ఏర్పాటుకు నో చెప్పిన బీజేపీ ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్యన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదేమంటే..అజిత్ పవర్ ఎన్సీపీ లెజిస్లేటివ్ నేత అని, ఆయన మద్దతు తమకు ఉందని బీజేపీ అంటోంది. 

ఎన్సీపీ ఎమ్మెల్యేలు పవార్ కు ఎన్నిక గురించి పెట్టిన  సంతకాలను బీజేపీ గవర్నర్ కు ఇచ్చిందని స్పష్టం అవుతోంది. మరి జాబితాను ఇచ్చారు  కాబట్టి.. ఇప్పుడు  విశ్వాస పరీక్షకు బీజేపీ గడువును అడగడమే విడ్డూరం. ఇరు పక్షాల  వాదనలు విన్న సుప్రీం కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.

రేపు ఉదయం పదిన్నరకు ఈ కేసులో న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది. విశ్వాస పరీక్ష గురించి కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తిదాయకంగా మారాయి. ఫడ్నవీస్ ప్రభుత్వం వెంటనే బలపరీక్షను ఎదుర్కొనాలని రేపు కోర్టు తీర్పునిస్తే.. బీజేపీకి గతుక్కుమన్నట్టే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.