యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్రికుడై బయల్దేరడానికి కేవలం నిమిషాల సమయం మాత్రమే వుంది. 400 రోజులు, 4 వేల కిలోమీటర్ల లక్ష్యంగా ఇవాళ ఆయన కుప్పంలో మొదటి అడుగు వేయనున్నారు. అయితే ఈ పాదయాత్ర పరిణామాలు తెలియడానికి 400 రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు.
మొదటి రోజే లోకేశ్ ఎలా మమేకం అవుతారో తేలనుంది. ఫస్ట్ ఇంప్రెషన్‌ను బలమైన సానుకూల కోణంలో వేయగలిగితే లోకేశ్‌కు తిరుగు వుండదు. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం లోకేశ్, టీడీపీ అభాసుపాలు కాక తప్పదు.
అందుకే ఇవాళ్టి లోకేశ్ పాదయాత్రపై టీడీపీ ఆందోళనగా ఉంది. లోకేశ్ పాదయాత్ర చేస్తాడనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకుంది. ఏమవుతుందో, ఏమో అనే తెలియని భయాందోళన టీడీపీ శ్రేణుల్ని వెంటాడుతోంది. దీనికి ప్రధాన కారణం లోకేశ్‌పై ఇప్పటికే పప్పు, అసమర్థ నాయకుడనే ముద్ర బలంగా ఉండడమే.
లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో టీడీపీని ఓడించాలంటూ పిలుపునిచ్చిన సందర్భాలు అనేకం. కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా వుందంటే అది టీడీపీనే అనే ఆణిముత్యాల్లాంటి మాటలు లోకేశ్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత కాలంలో లోకేశ్ తెలుగు మాట్లాడ్డంలో బాగా మెరుగుపడ్డారని అంటున్నారు. జనంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ ఎలా మాట్లాడ్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు టీడీపీ బద్ధ శత్రువైన వైఎస్ జగన్ పాదయాత్ర సూపర్‌హిట్ కావడం కూడా లోకేశ్‌పై ఒత్తిడి పెంచుతోంది.
లోకేశ్ ప్రతి కదలికను జగన్‌తో పోల్చి చూస్తారు. ఇదే జగన్ అయితే అలా చేశారు, ఇలా స్పందించారనే పోలిక మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర అనంతం బహిరంగ సభలో కేవలం లోకేశ్ మాత్రమే ప్రసంగించనున్నారు.
లోకేశ్ ప్రసంగం కోసం అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. లోకేశ్ మాట తడబాటు కోసం వైసీపీ ఎదురు చూస్తుంటే, స్ఫూర్తిదాయక, చరిత్రలో నిలిచిపోయేలా మాట్లాడాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. మరి ఎవరి కోరికను లోకేశ్ నెరవేరుస్తారో కొన్ని గంటల్లో తేలనుంది.
లోకేశ్ సినిమా హిట్టా? ఫట్టా? అనేది ఈ రోజే తేలిపోతుందనేది నిజం. హిట్ అయితే మాత్రం లోకేశ్‌కు తిరుగు వుండదు. ఫట్ అయితే మాత్రం టీడీపీకి పాదయాత్ర గరళమే అని చెప్పాల్సి వుంటుంది.