జమున అంటే చాలు..నిన్నటి తరం నుంచి నేటి తరం వరకు గుర్తు వచ్చే పేరు ఒక్కటే. కొన్ని పేర్లు భలే గా వుంటాయి. ఇంకెవరికైనా ఈ పేరు వుందా? అనే అనుమానం కలిగేలా. జమున పేరు అచ్చంగా అలాంటిదే.
సినిమా రంగంలో ఆమె స్థానం కూడా అలాంటిదే. తొలి గ్లామర్ హీరోయిన్..నటనలో ఓ చిలిపితనం..సొగసుదనం..గడుసుతనం అన్నీ తొంగి చూసేవి. ఏ పాత్ర వేస్తే అందులోకి పరకాయ ప్రవేశం కామన్. నటిగా అది ఆమె స్టామినా.
అలాంటి జమున తన 87వ ఏట కన్నుమూసారు. తొలితరం హీరోలు అందరి సరసన అన్ని రకాల పాత్రలు ధరించారు. హీరోలతో సమానమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. వయసు మీద పడిన తరువాత కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ లో కనిపించినా హుషారుగానే వుండేవారు.
సత్యభామగా ‘మీరజాలగలడా నా యానతి’ అనేపాటకు డ్యాన్స్ చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ పాటలో ఆమె ఠీవి, హొయలు, సొగసు అన్నీ తొంగి చూసేవి.
టాలీవుడ్ లో నెమ్మదిగా ఓ తరం వెళ్లిపోతోంది. జమున కూడా అలాగే నిష్క్రమించారు. ఆత్రేయ చెప్పినట్లు పోయినొళ్లు అందరూ మంచోళ్లు..ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు. జమున తీపి గురుతులు సినిమాల రూపంలో చాలా వున్నాయి.