బాబు కన్నీళ్లు ఓట్లు కురిపిస్తాయా? నెవ్వర్!!

తన భార్యకు అవమానం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రస్తుతానికి రాష్ట్రమంతా ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు కన్నీళ్ల పేరిట పెద్ద డ్రామా నడిపించాడని వైసీపీ దళాలు…

తన భార్యకు అవమానం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రస్తుతానికి రాష్ట్రమంతా ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు కన్నీళ్ల పేరిట పెద్ద డ్రామా నడిపించాడని వైసీపీ దళాలు ఎద్దేవా చేస్తుండగా.. చంద్రబాబు కన్నీళ్లు అధికార పార్టీ వారి అహంకారాన్ని దహించివేస్తాయని తెలుగుదేశంవారు శాపాలు పెడుతున్నారు. 

కుప్పం మునిసిపాలిటీని కూడా ఓడిపోయిన తర్వాత.. శాసనసభకు రావడానికి కూడా మొహం చెల్లనందునే డుమ్మా కొట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని.. అందుచేత తన భార్యను అవమానించారనే అబద్ధపు ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. 

అయితే తెలుగుదేశం పార్టీ వారిలో ఒక ఆశ వ్యక్తం అవుతోంది. చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. వ్యక్తిగత జీవితంలో పెద్ద దుఃఖమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రజలు చూడలేదు. 

అలాంటిది ఆయన ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల.. ప్రజల్లో గొప్ప సానుభూతి వస్తుందనే ఆశ పార్టీలో ఉంది. ఇది నిజమేనా.. కన్నీళ్లు ఆయనలో ఉండే వేదనను దించేయగలవేమో గానీ.. వాటికి ఓట్లను రాబట్టేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అనేది ఇప్పుడు ప్రశ్న. 

సాధారణంగా కన్నీళ్లు సానుభూతిని మాత్రం రాబడతాయి. అయితే చంద్రబాబు విషయంలో మాత్రమే అది కూడా సందేహమే. ఎందుకంటే.. ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు కన్నీళ్లు పెట్టుకుంటే వారికి సానుభూతి దక్కుతుంది. 

చంద్రబాబు విషయంలో ఆయన చాణక్యుడు, ఎడ్మినిస్ట్రేటర్ లాంటి పదాలు ఏమైనా అభిమానులు చెప్పవచ్చు గానీ.. ఆయనకున్న క్రెడిబిలిటీ మాత్రం సున్నా. సొంత పార్టీ వారు కూడా ఆయనను పూర్తిగా విశ్వసించరు. ఆయనకూడా ఎవ్వరినీ విశ్వాసంలోకి తీసుకోరు. అలాంటి చంద్రబాబు నాయుడు కన్నీళ్ల వలన సానుభూతి సాధ్యమేనా? అది ఓట్లు కురిపించేంతగా మారుతుందా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. 

2003లో తిరుపతిలో అలిపిరి వద్ద ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును హతమార్చడానికి నక్చలైట్లు క్లెమోర్ మైన్స్ పేల్చారు. ఈ దాడిలో ఆయన సహా మరికొందరు నాయకులు గాయపడ్డారు. తన మీద జరిగిన హత్యాప్రయత్నం వల్ల ప్రజల్లో సానుభూతి పుట్టి ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 

ఒకరకంగా అది మంచి వ్యూహమే. కానీ.. తన మీద జరిగిన దాడివలన.. ప్రజల్లో ఎలాంటి సానుభూతి పుట్టలేదని ఆయన గుర్తించలేకపోయారు. చంద్రబాబు మీద హత్యాయత్నం, బాంబుదాడి జరిగితేనే ఆ వెంటనే వచ్చిన ఎన్నికల్లో సానుభూతి చూపించి ఓట్లు వేయని ప్రజలు.. ఆయన జస్ట్ కన్నీళ్లు పెట్టుకుంటే రెండేళ్ల తర్వాత రాబోయే ఎన్నికల్లో సానుభూతి ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ. 

ఒకవేళ ఈ కన్నీళ్ల వల్ల ఈసారి గద్దె ఎక్కుతామనే భ్రమలో పార్టీ వారు ఉంటే గనుక.. ఆ భ్రమల్ని వీడడం మంచిదని పలువురు విశ్లేషిస్తున్నారు.