తన చెల్లి భువనేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు బాధ చూడలేకున్నామని నందమూరి తారక రామారావు తనయ నారా లోకేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య భువనేశ్వరిపై అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నిన్న కన్నీళ్ల పర్యంతమైన సంగతి తెలిసిందే. ఇక సీఎంగా తప్ప… అసెంబ్లీలో అడుగు పెట్టనని చంద్రబాబు శపథం చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ఈ నేపథ్యంలో ఇవాళ భువనేశ్వరి సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భువనేశ్వరి అక్క లోకేశ్వరి మాట్లాడుతూ నిన్నటి పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తన సోదరి మానసిక స్థితిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఫ్యామిలీలో జరగలేదన్నారు. నిన్నటి సంఘటన చాలా దురదృష్టకరమైందన్నారు. తన లెక్కలో అసెంబ్లీ అనేది దేవాలయంతో సమానమన్నారు. కొంత మంది నోటికొచ్చినట్టు మాట్లాడి దాన్ని అపవిత్రం చేస్తున్నారని వాపోయారు.
చంద్రబాబునాయుడు లాంటి పెద్ద మనిషి విలపిస్తుంటే తాము చూడలేకపోయామని లోకేశ్వరి తల్లడిల్లారు. తమ చెల్లెలు భువనేశ్వరి అంతకంటే బాధపడుతోందన్నారు. వాళ్లద్దరి బాధ చూడలేకపోతున్నామని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు హయాంలో ఏనాడూ విజయమ్మ, భారతి, షర్మిలల గురించి ఆయన అనలేదని, అలాగే ఎవరితోనూ అనిపించలేదని లోకేశ్వరి చెప్పుకొచ్చారు. కానీ వీళ్లు అట్లా ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డం చాలా తప్పు అన్నారు.
ఎందుకలా చేశారో తమకు అర్థం కావడం లేదన్నారు. కావున ఇలాంటిది మరోసారి పునరావృతం కాకుండా ఉంటే మంచిదన్నారు. తమలో కూడా ఎన్టీఆర్ రక్తమే ఉందన్నారు. ఇలా మరోసారి జరిగితే మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు, తమ్ముళ్లు, తమ సిస్టర్స్ అందరం ఏకమవుతామని లోకేశ్వరి వెల్లడించారు. తమలోని మరో అవతరాన్ని చూడాల్సి వస్తుందని భువనేశ్వరి హెచ్చరించడం గమనార్హం.