చంద్రబాబు కంటతడిపై చర్చోపచర్చలు జరుగుతూనే వున్నాయి. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, తమ నాయకుడు వైఎస్ జగన్‌ను దూషించడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో బాబు గతంలో వివిధ సందర్భాల్లో ప్రధాని మోడీ, జగన్‌లను వ్యక్తిగతంగా మాట్లాడ్డానికి సంబంధించి వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు తమ నాయకుడి ఏడ్పుపై తీవ్రంగా స్పందించారు.
అధికార పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు పంపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరల్లోనే వున్నాయన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి నిజాలు బయటికొస్తున్నాయన్నారు. వాటి మీదే చర్చ జరగాలన్నారు. రేపటి నుంచి వివేకా హత్యపైనే గ్రామస్థాయిలో చర్చ పెడతామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కంటతడి పెట్టడం రాష్ట్రానికి అరిష్టమని నక్కా ఆనందబాబు చెప్పుకొచ్చారు. విజ్ఞులైన పౌరులు దీని గురించి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వైసీపీ నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా తమ కార్యకర్తలు మనో స్థైర్యం కోల్పోరని నక్కా అన్నారు. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏపీలో ప్రతిపక్షాలను తుడిచి పెట్టాలనే ఆలోచన తప్పని ఆయన అన్నారు.