బాబు బాధను పవన్ మాత్రమే అర్థం చేసుకోగలరు!

చంద్రబాబు సెంటిమెంట్ సీన్ ని బాగా రక్తికట్టించారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. అదే సమయంలో జగన్ వ్యతిరేక బ్యాచ్ అంతా బాబుకి మద్దతిస్తూ మాట్లాడుతోంది. స్థానిక ఎన్నికల్లో తన పార్టీ విజేతలకు శుభాకాంక్షలు…

చంద్రబాబు సెంటిమెంట్ సీన్ ని బాగా రక్తికట్టించారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. అదే సమయంలో జగన్ వ్యతిరేక బ్యాచ్ అంతా బాబుకి మద్దతిస్తూ మాట్లాడుతోంది. స్థానిక ఎన్నికల్లో తన పార్టీ విజేతలకు శుభాకాంక్షలు చెప్పడంలో ఒకరోజు ఆలస్యం చేశారేమో కానీ.. చంద్రబాబు బాధపై మాత్రం కొన్ని గంటలు కూడా ఆలస్యం చేయకుండా ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్ కల్యాణ్. 

చంద్రబాబు కంటతడిపెట్టడం బాధాకరం అన్న పవన్ కల్యాణ్, ఇలాంటి ఘటనల వల్ల సామాన్యులకు రాజకీయాల పట్ల ఏహ్యభావం పెరిగిపోతుంది ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వరదలు వస్తే, అవేవీ పట్టనట్టు అసెంబ్లీలో ఈ ర్యాగింగ్ సీన్ ఏంటని తన ప్రెస్ నోట్ ద్వారా ప్రశ్నించారు జనసేనాని.

పవన్ కూడా బాధితుడే..

ఆ మాటకొస్తే గతంలో పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితుడేనని చెప్పాలి. ఎవరు కామెంట్ చేశారు, ఏమని కామెంట్ చేశారనే విషయాలు పక్కనపెడితే.. పవన్ వివాహ విషయాలను చాలామంది చాలా సార్లు హైలెట్ చేశారు. నా పెళ్లిళ్ల గురించి మీకెందుకు, కావాలంటే మీరు కూడా చేసుకోండి అని ఉడుక్కునేలా పవన్ మారిపోయారంటే ఆ మాటలు ఆయనకు బాగానే గుచ్చుకున్నాయని అర్థం. 

ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి.. ఓ బాధితుడి బాధ మరో బాధితుడికే తెలుసన్నట్టు పవన్ కల్యాణ్ నేరుగా స్టేట్ మెంట్ ఇచ్చి అండగా నిలబడ్డారు.

అయితే పవన్ ఇక్కడ తెలివిగా.. రెండువైపులా మాట్లాడారు. గతంలో జగన్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు కూడా తాను ఇలాగే ఖండించానని, ఇప్పుడు కూడా అలాంటి మాటలు తప్పు అని చెబుతున్నానని అన్నారు పవన్ కల్యాణ్. ఇలాంటి వాటిని అందరూ ఖండించాలని, లేకపోతే ఇది ఒక అంటు వ్యాధి అవుతుందని అన్నారు.

అయితే ఈ అంటు వ్యాధిని అంటించింది ఎవరనేది మాత్రం పవన్ చెప్పలేకపోవడం విశేషం. దశాబ్దం కిందటే ఈ వ్యక్తిత్వ హననం అనే చెత్త సంస్కృతిని, తన ఎల్లో మీడియా సహకారంతో చంద్రబాబు ప్రారంభించారనే విషయాన్ని పవన్ ఆయాచితంగా మరిచిపోయారు.

మొత్తమ్మీద చంద్రబాబు ఘటనని పవన్ కల్యాణ్ కంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేరేమో అనేంతలా ఆయన స్పందన ఉంది అనేది మాత్రం వాస్తవం.