అటు రాజకీయ నాయకుడు కాని, ఇటు పూర్తిస్థాయి సినీనటుడు కాని నాగబాబు మరోసారి ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టారు. బాబు ఏడుపుగొట్టు ఎపిసోడ్ పై తనదైన శైలిలో స్పందించారు. పేజీ ప్రవచనాల్ని వళ్లించారు.
ఆయన ఖండన లేఖాస్త్రం బాగానే ఉంది కానీ, ఉన్నఫలంగా నాగబాబు ఇలా మరోసారి ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం, మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బాబుపై సింపతీ చూపించడాన్ని నెటిజన్లు తట్టుకోలేకపోయారు. గతంలో నాగబాబు వైఖరిని ఎండగట్టారు.
కోట శ్రీనివాసరావు ఏం తప్పు చేశారు?
ఏదో జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబుకు మద్దతుగా, ఏకంగా రాజకీయ వ్యవస్థనే తప్పుబడుతూ నాగబాబు రాసిన లేఖపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. గతంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును అనరాని మాటలన్నప్పుడు ఆ హుందాతనం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినీచరిత్రలో నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు లాంటి నటుడ్ని పట్టుకొని యానిమల్ అనే పదం వాడినప్పుడు నాగబాబు హుందాతనం ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
“నీకు ఒకర్ని విమర్శించే నైతిక హక్కు తప్ప.. వారిని తిట్టి లేదా వారి కుటుంబాల్ని దూషించే అధికారం ఏమాత్రం లేదు” అనేది నాగబాబు సూక్తుల్లో ఒక సూక్తి. మరి ఇదే సూక్తిని గతంలో పోసాని వ్యవహారంలో ఎందుకు నాగబాబు, అతడి అనుచరులు పాటించలేకపోయారనేది ప్రశ్న.
పోసాని భార్యను తిడితే తప్పు లేదా..?
మొన్నటికిమొన్న పోసాని వ్యవహారంలో జరిగింది ఇదే కథ. ఆయన భార్యను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అనరాని మాటలు అనలేదా. అప్పుడు ఈ హుందాతనం అంతా ఏమైపోయింది నాగబాబు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు, తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించిన నాగబాబు.. ఇప్పుడు చంద్రబాబుపై ఏదో వ్యక్తిగత హననం జరిగిపోయిందంటూ మరోసారి రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ మాటకొస్తే.. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన తల్లిని అనరాని మాటలు అన్నప్పుడు ఇదే నాగబాబు ఎక్కడికిపోయారు. ఆ రోజే ఎందుకు స్పందించలేదు.
నాగబాబు ఖండన ప్రకటన హుందానే ఉంది. అందులో ఏదీ తప్పుపడ్డాల్సిన అవసరం లేదు. బోసడీకే అనే పదప్రయోగాన్ని కూడా ఆయన ఖండించారు. చంద్రబాబును ప్రత్యర్థిగానూ చెప్పుకొచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకుల్ని కూడా విమర్శించారు. కానీ ఇదేదో ప్రతి సందర్భంలో చేసి ఉంటే బాగుండేది కదా అనేది నెటిజన్ల మాట.
వైఎస్ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దూషించినప్పుడు స్పందించని నాగబాబు.. ఇప్పుడు చంద్రబాబు ఏడుపుగొట్టు ఎపిసోడ్ లో పై మాత్రం స్పందిస్తూ.. “రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తలుచుకొని బాధపడాలో భయపడాలో తెలియని సందిగ్ద దుస్థితి ఏర్పడింది” అంటూ మొసలికన్నీరు కార్చడమే జనాలకు నచ్చలేదు.