హీరోయిన్ షాలూ చౌరాసియాపై కేబీఆర్ పార్క్ లో జరిగిన దాడి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని బాబుగా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇతడు సినీ కార్మికుడే. దాడికి సంబంధించి చాలా విషయాలు బయటపెట్టాడు. అయితే చౌరాసియా నుంచి కొట్టేసిన ఐఫోన్ జాడ మాత్రం ఇంకా తెలియలేదు.
పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన చౌరాసియా.. కేబీఆర్ పార్క్ లో జాగింగ్ చేసింది. జాగింగ్ చేస్తూ ఓ చోట నిలబడిన ఆమెను వెనక నుంచి ఓ వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె నోటికి గుడ్డ కట్టే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు.
ఈ క్రమంలో చౌరాసియా తీవ్రంగా ప్రతిఘటించడంతో అగంతకుడు ఆమెపై భౌతిక దాడికి దిగాడు. తర్వాత అక్కడ్నుంచి పారిపోయాడు. చాలామంది సినీ ప్రముఖులు జాగింగ్ చేసే ఈ పార్క్ లో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కానీ సీసీటీవీ కెమెరాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇక అగంతకుడు ఎత్తుకెళ్లిన ఫోన్ కాన్సర్ హాస్పిటల్ దగ్గర స్విచాఫ్ అయింది. దీంతో అనుమానితుల జాబితా ఆధారంగా దర్యాప్తు చేశారు.
అలా పాత నేరస్థుల్ని విచారిస్తూనే, మరోవైపు ఘటన స్థలంలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా విచారణ చేపట్టారు. అలా రోజుల వ్యవథిలో అగంతకుడ్ని పట్టుకున్నారు. అతడ్ని బాబుగా గుర్తించారు. ఈరోజు బాబును మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు.