భువ‌నేశ్వ‌రిపై మ‌చ్చ‌…బాబు పాత్ర ఏంటి?

నారా భువ‌నేశ్వ‌రి… దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ త‌న‌య‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి స‌తీమ‌ణి. ఏ రోజూ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోలేదామె.హెరిటేజ్ వ్యాపారాలు చూసుకుంటూ, త‌న ప‌ని తాను చేసుకుపోతూ వివాద ర‌హిత మ‌హిళ‌గా అంద‌రి…

నారా భువ‌నేశ్వ‌రి… దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ త‌న‌య‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి స‌తీమ‌ణి. ఏ రోజూ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోలేదామె.హెరిటేజ్ వ్యాపారాలు చూసుకుంటూ, త‌న ప‌ని తాను చేసుకుపోతూ వివాద ర‌హిత మ‌హిళ‌గా అంద‌రి గౌర‌వాన్ని పొందుతున్నారు. ఇందులో మ‌రో మాట‌కే స్థానం లేదు.

కానీ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల కుదుపున‌కు ఆమె కేంద్ర బిందువు కావ‌డం అత్యంత విచార‌క‌రం. ఓ గౌర‌వ మాతృమూర్తిని రాజ‌కీయ రొచ్చులోకి లాగ‌డం ఎంత మాత్రం స‌మాజానికి, రాజ‌కీయాల‌కు మంచిది కాదు. ఇదే సూత్రం వైఎస్ జ‌గ‌న్ కుటుంబంలోని మ‌హిళ‌ల విష‌యంలోనూ వ‌ర్తిస్తుంది.

నారా భువ‌నేశ్వ‌రిని ప్ర‌స్తుత రాజ‌కీయ ర‌చ్చ‌లోకి లాగ‌డంలో అధికార వైసీపీ ఎంత కార‌ణ‌మో, అంత‌కు రెట్టింపు కార‌ణం టీడీపీ అవుతుంది. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు ఆవేశం, రాజ‌కీయ స్వార్థం కూడా భువ‌నేశ్వ‌రి పేరు రాజ‌కీయ తెర‌పైకి రావ‌డానికి కార‌ణమ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి చంద్ర‌బాబు, టీడీపీ శ్రేణులు ఆవేశం, ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యంలో మౌనం పాటించి, అసంద‌ర్భ విష‌యానికి సీరియ‌స్‌గా స్పందించార‌నే అభిప్రాయాలు పౌర స‌మాజం నుంచి వ‌స్తున్నాయి.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి తీవ్ర అభ్యంత‌ర‌క‌ర భాష‌లో దూషించిన సంద‌ర్భంలో, టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఘాటుగా స్పందించారు. లోకేశ్ గురించి విమ‌ర్శించే ఉద్దేశంతో వ‌ల్ల‌భ‌నేని వంశీ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి పేరు బ‌య‌టికి తీసి లోకేశ్ మాతృమూర్తిపై వ‌ల్ల‌భ‌నేని ప‌రిధి దాటి నోరు జారారు. అప్పుడే చంద్ర‌బాబు, టీడీపీ శ్రేణులు తీవ్ర‌స్థాయిలో స్పందించి వుండాల్సింది.

అప్పుడు మాత్రం మౌనాన్ని ఆశ్ర‌యించి, నిన్న అసెంబ్లీ స‌మావేశాల్లో అది కూడా త‌న పార్టీ స‌భ్యులు రెచ్చ‌గొట్ట‌డం, దానికి అంబ‌టి త‌న‌దైన శైలిలో మాధ‌వ‌రెడ్డి పేరు ప్ర‌స్తావిస్తూ వెట‌కారం చేయ‌డం అంద‌రికీ తెలిసిందే. నేరుగా దూషించిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశీని విడిచిపెట్టి, త‌న‌పై వ్య‌క్తిగ‌త దాడి నుంచి ర‌క్ష‌ణ కోసం ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేసిన అంబ‌టిపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

భువ‌నేశ్వ‌రి గురించే అంబ‌టి మాట్లాడార‌ని త‌న‌కు తానుగా అన్వ‌యించుకుని, అర్థం చేసుకుని బాబు తీవ్ర నిర్ణ‌యం తీసుకుంటార‌ని బ‌హుశా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఊహించి ఉండ‌రు. నైతికంగా త‌ప్ప‌, సాంకేతికంగా భువ‌నేశ్వ‌రి గురించి వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడార‌ని ఎక్క‌డా ఆధారాలు లేవు. అందుకే భువ‌నేశ్వ‌రి గురించి తాము ఎక్క‌డ మాట్లాడామో చూపించాల‌ని సీఎం జ‌గ‌న్‌తో స‌హా అంబ‌టి, మంత్రులు కొడాలి, పేర్ని నాని త‌దిత‌రులు ప్ర‌శ్నిస్తున్నారు.

అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యంపై అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని మాట‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

“సానుభూతి కోసం బాబు తన కుటుంబ సభ్యులను కూడా రోడ్డుకీడుస్తారు. చివరకు భార్యను సైతం రాజకీయాల కోసం వాడుకున్నారు. చంద్రబాబు మంగమ్మ శపథాలను ఎవరూ నమ్మరు. సీఎం పదవి కోసం చంద్రబాబు భార్యను కూడా రోడ్డు మీదకు తెచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. 

అసెంబ్లీలో ఏ ఒక్కరూ చంద్రబాబు కుటుంబ సభ్యులను గాని, ఆయన భార్యను గురించి కానీ మాట్లాడలేదు. ఇప్పటిదాకా బాబు కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు అంటున్నాడు కానీ ఎవరు మాట్లాడారో మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. నా భార్యను అన్నారు అంటూ భార్యను కూడా రాజకీయం కోసం వాడుకునేస్థాయికి దిగజారిపోయిన వ్యక్తి చంద్రబాబు.  రాజకీయ అవసరాల కోసం భార్యను ఈ స్థాయిలో వాడుకున్న వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు”

ఈ వివాదానికి కార‌ణ‌మైన అంబ‌టి రాంబాబు ఏమంటున్నారంటే….

‘పదవి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడరు. స్వభావరీత్యా జిత్తులమారి అయిన చంద్రబాబు నాడు మామ ఎన్టీఆర్‌ను, నేడు భార్యను అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరిని ఏదో అన్నా మని చెబుతున్నారు. ఆమెను నేను కానీ, మా పార్టీవాళ్లు కానీ ఏమీ అనలేదు. చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాం. మహిళలను అనే స్వభావం మాది కాదు. ఈ రోజు భార్యను అడ్డు పెట్టు కుని సానుభూతి పొందాలని డ్రామాలు చేస్తున్నారు. భువనేశ్వరిని అన్నట్టు ఆధారాలుంటే బయట పెట్టండి. ఈ విషయంలో భువనేశ్వరి కూడా చంద్రబాబును నిలదీయాలి’ అని సూచించారు.

అసెంబ్లీని చంద్ర‌బాబు బ‌హిష్క‌రించ‌డం ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. దేనికి బ‌హిష్క‌రించార‌నే ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు అంబ‌టి రాంబాబు మాజీ మంత్రి ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి గురించి ప్ర‌స్తావించార‌ని, దీంతో చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హావేశానికి లోనై క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పుకోవాల్సి ఉంటుంది. 

ఇదేమైనా భువ‌నేశ్వ‌రికి గౌర‌వం తెచ్చేదా? బాబు తొంద‌ర‌పాటు వ‌ల్ల ముందు త‌రాలు కూడా భువ‌నేశ్వ‌రి గురించి ఈ విధంగా త‌ల‌చుకోవాల్సి వుంటుంది. ఇదేనా భార్య భువ‌నేశ్వ‌రికి చంద్ర‌బాబు ఇచ్చే గౌర‌వం? భార్య కోసమైనా అసెంబ్లీలో కాస్త సంయ‌మ‌నం పాటించి వుంటే భువ‌నేశ్వ‌రికి ఎంతో గౌర‌వంగా ఉండేది. త‌న జీవిత భాగ‌స్వామికి చెదిరిపోని మ‌చ్చ‌ను మిగల్చ‌డంలో చంద్ర‌బాబే మొద‌టి ముద్దాయి అంటే కాద‌న‌గ‌ల‌రా?