ఈ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందనే అంశం గురించి వీడియోలను వెదుక్కొని చూసిన ప్రజలకు సూటిగా అర్థం అవుతున్న విషయం.. యథారీతిన తెలుగుదేశం రెచ్చగొట్టింది. ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతుండగా.. గంట, అరగంటూ అంటూ సెటైరిక్ కామెంట్లు పడ్డాయి. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలన్నా, నేతలన్నా, ముఖ్యమంత్రి అన్నా.. ఎప్పుడూ లోకువే. అందుకే అది అసెంబ్లీ అని కూడా పట్టించుకోకుండా నిర్లజ్జగా అలాంటి వ్యంగ్యాన్ని వ్యక్తీకరించారు.
అదే సమయంలో చంద్రబాబు నాయుడు అనుచితమైన ప్రసంగం చేశారు. బాబాయ్, గొడ్డలి, తల్లికి మోసం, చెల్లికి మోసం అంటూ.. చంద్రబాబు నాయుడు తన ప్రెస్ మీట్ లలోనూ, జూమ్ మీటింగుల్లోనూ మాట్లాడినట్టుగా మాట్లాడారు. ఇది ఈ ఎపిసోడ్ కు ట్రైలర్ పార్ట్.
టీడీపీనే ముందుగా ఈ చచ్చుపుచ్చు రచ్చను మొదలెట్టింది. కట్ చేస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వాగ్బాణాలు పడ్డాయి. వివేకానందరెడ్డి హత్య గురించినే ఎందుకు.. ఎలిమినేటి మాధవరెడ్డి, వంగవీటి హత్యల గురించి కూడా చర్చిద్దాం అంటూ.. అంబటి కౌంటర్ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ప్రసక్తుల నేపథ్యంలోనే తను ఎన్టీఆర్, మాధవరెడ్డి, వంగవీటి మరణాల గురించి మాట్లాడినట్టుగా అంబటి అంటున్నారు. అయితే.. చంద్రబాబు నాయుడు దీన్ని మరో వైపుకు తీసుకెళ్లారు.
మాధవరెడ్డి హత్యను ఆయన ఇంకేదో కోణంలో చూసి అసెంబ్లీలో ఇక అడుగుపెట్టనంటూ బయటకు రావడం, ఆ పై ప్రెస్ మీట్ లో ఏడుపు.. స్థూలంగా ఇదీ కథ. రాజకీయ నేతలు ఏది చూసినా.. వారు భావోద్వేగాలతో చేయరని, ఏదో రాజకీయ ప్రణాళికే వారి ఏడ్పైనా, నవ్వైనా అనేది ప్రజల్లో ఉన్న కామన్ ఒపీనియన్. అందులోనూ ఎన్నో డక్కామొక్కిళు తిన్న చంద్రబాబు నాయుడు… తన ఫ్యామిలీని ఏదో అన్నారని భావోద్వేగానికి గురయ్యే టైపూ కాదనే అభిప్రాయాలూ ప్రజలకు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో ఆయన సెంటిమెంటును పండించాలని ప్రయత్నించి ఉండవచ్చు. అయితే.. సోషల్ మీడియాలో చంద్రబాబు ఏడుపు వీడియోకు వచ్చిన స్పందనలను గమనిస్తే.. ఎక్కడా సానుభూతి వర్షించకపోవడం గమనార్హం!
సోషల్ మీడియాలో చంద్రబాబు ఏడుపు వీడియోకు వచ్చిన స్పందనల్లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. వాటిల్లో ఒకటి ఆయన సానుభూతిని ఆశిస్తున్నారని, యాక్షన్ చేస్తున్నారనే స్పందన ఒకటి. రెండోది.. ఎంతో మందిని ఏడిపించిన నువ్వు ఏడవడం ఏందయ్యా అనేది! ఆ ఎంతోమందిలో ఎన్టీఆర్ పేరును ముందువరసలో పేర్కొంటున్నారు నెటిజన్లు. అసెంబ్లీ వేదికగానే చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామను ఏడిపించి పంపారని, ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ ఆ రోజు ఏడ్చిన ఏడ్పుకు ప్రతిఫలమే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి అనేది రెండో స్పందన. ఇక మూడోది.. నరేంద్రమోడీ గురించి కావడం గమనార్హం!
వెనుకటికి చంద్రబాబు నాయుడు నరేంద్రమోడీ, ఆయన భార్య యశోదబెన్ గురించి ఇష్టానుసారం మాట్లాడారు. మోడీ తన భార్యను వదిలేశాడని.. అసెంబ్లీతో మొదలుపెడితే ఢిల్లీ వరకూ వెళ్లి చంద్రబాబు పదే పదే వ్యాఖ్యానించారు. ఆ వీడియోలూ ఎక్కడికీ పోలేదు.
ఇప్పుడు తన భార్యను ఎవరో ఏదో అన్నారని.. అది కూడా డైరెక్టుగా కాదు.. డైరెక్టుగా అయితే ఎవరూ ఏమనలేదు! కానీ చంద్రబాబు బావురుమన్నారు. మరి నాడు మోడీ దాంపత్యం గురించి చంద్రబాబు పదే పదే ఎందుకు మాట్లాడారు? తన భార్య ప్రస్తావన ఎవరో తీసుకొస్తే దానికి ఏడుపు, తను మాత్రం దేశ ప్రధాని భార్య ప్రస్తావన కూడా తీసుకురావచ్చు. ఇదేనా చంద్రబాబూ నీ నీతి? అనే ప్రశ్నా ఎదురవుతోంది.
ఇక వీర టీడీపీ వర్గాలు మాత్రం చంద్రన్న ఏడుపు సాక్షిగా ఆయనను మళ్లీ సీఎంను చేస్తామంటున్నాయి. అయితే చంద్రబాబు మరీ ఇంత బేలగా ఏడవడం, డైరెక్టుగా అనకపోయినా.. ఏదో అనేసినట్టుగా యాగీ చేయడం మాత్రం టీడీపీ శ్రేణులను ఈ వ్యవహారంలోకి దించలేకపోతోంది. ఎమోషన్ మిస్ అయ్యింది.
చంద్రబాబు ఏడుపుతో ఆయన పై సానుభూతి మాట అటుంచి, వెనుకటి కథలన్నీ వెదికి తీయడానికి చంద్రబాబే మంచి అవకాశం ఇచ్చినట్టుగా ఉంది ప్రత్యర్థులందరికీ ఈ వ్యవహారం! ఇదీ చంద్రబాబు చేసుకున్న అతి పెద్ద సెల్ఫ్ గోల్!