సాధారణంగా సినిమాల మీదా లేదా సినిమా జనాల మీద రాసే పుస్తకాలు, ఆయా రచయితలకు, అభిమానులకు తప్ప వేరే వాళ్లకు ఉపయోగపడవు. ముఖ్యంగా బతికి వున్న సినిమా పెద్దల మీద భజన పాటల మాదిరిగా, ఫొటోలు వేసి ప్రచురించే పుస్తకాలు ఆ రచయితలు తప్ప మరెవరు చెప్పుకోవడానికి పెద్దగా వుండవు. కానీ అప్పడప్పుడు మంచి సినిమా పుస్తకాలు కూడా వస్తుంటాయి. అలాంటి పుస్తకమే జై విఠలాచార్య. త్వరలో రాబోతున్న ఈ పుస్తకం కవర్ ను సీనియర్ హీరో కృష్ణ ఆవిష్కరించారు.
అలనాటి తెలుగు దర్శకులు అంటే కేవి రెడ్డి దగ్గర నుంచి కే విశ్వనాధ్ వరకు చాలా మంది గురించి చెప్పుకుంటారు. కానీ ఆరోజుల్లో నిజమైన మాస్ డైరక్టర్ అంటే విఠాలాచార్య నే. ఇప్పుడు చెప్పుకుంటున్న బి సి సెంటర్ల ప్రేక్షకులను ఆయన ఉర్రూతలూగించారు. వరుసగా చకచకా సినిమాలు తీసారు. కథ ఆయన స్వంతం ఆయన ఎలాగైనా దాన్ని మార్చుకునేవారు. సినిమా ఆద్యతం పామర జన రంజకం అన్నదే ఆయన సిద్దాంతం.
దశాబ్దాల కాలం పాటు సినీ ప్రేమికులు ఆదరించిన విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఆ సమగ్ర పుస్తకానికి 'జై విఠలాచార్య' అని పేరు పెట్టారు. ఈ పుస్తకం త్వరలో మార్కెట్ లోకి రాబోతోంది.
పులగం చిన్నారాయణ గతంలో కూడా కొన్ని మంచి సినిమా పుస్తకాలు రచించారు. భజన పుస్తకాల మాదిరిగా కాకుండా కంటెంట్ వున్న 'జంధ్యా మారుతం', 'ఆనాటి ఆనవాళ్ళు', 'సినీ పూర్ణోదయం', 'స్వర్ణయుగపు సంగీత దర్శకులు', 'పసిడి తెర', 'సినిమా వెనుక స్టోరీలు', 'మాయాబజార్ మధుర స్మృతులు', 'వెండి చందమామలు'… ఇప్పటివరకూ పులగం చిన్నారాయణ ఎనిమిది పుస్తకాలు రాశారు. మూడు నందులు అందుకున్న సక్సెస్ ఫుల్ రైటర్ ఆయన.