ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అది కూడా అవాంఛనీయ ఘటనలు కావడం విచారకరం. ప్రజా సమస్యలపై పాలక ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం శ్రద్ధాసక్తులున్నాయో నేటి అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనం.
చిల్లర విషయాలను ప్రస్తావించి ఒకరిపై ఒకరు నీచమైన కామెంట్స్ చేసుకోవడం. ఆ తర్వాత చంద్రబాబు సభా బహిష్కరణ పిలుపు…అన్నీ సినిమాటిక్‌గా జరిగిపోయాయి. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్వడం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామంగా చెప్పొచ్చు.
బాబు ఏడుపులు, పెడబొబ్బలపై ప్రత్యర్థులు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసురుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైసీపీ మహిళా ఫైర్‌బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఇంత కాలం ఎంతో మందిని ఏడ్పించిన బాబుకు. అందరి ఉసురు తగిలిందని రోజా శాపనార్థాలు పెట్టారు. విధి ఎవరినీ విడిచిపెట్టదని రోజా పేర్కొన్నారు. గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రోజా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజా ఏమన్నారో ఆమె మాటల్లోనే…
“చంద్రబాబు విధి ఎవరినీ విడిచిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. 72 ఏళ్ల ఎన్టీఆర్‌ని ఎంత ఏడ్పించావో గుర్తుందా? 71 సంవత్సరాల 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు… మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని.
ఏదో నీ భార్యని అనేశారని చాలా బాధపడి పోతున్నావే, మరి ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందని పీతల సుజాతతో మీడియా పాయింట్‌లో సీడీలు చూపించిన విషయం మరిచిపోయావా? అంటే నాకొక ఫ్యామిలీ లేదు, నాకు పిల్లలు లేరు, మాకు గౌరవం లేదా? నువ్వు అధికారంలో వున్నప్పుడు ఎవరినైనా ఏమైనా అంటావు.
ఇదే విజయమ్మను ఎంత ఏడ్పించావ్, భారతమ్మ గురించి ఎన్ని మాట్లాడావు? షర్మిలను ఏ విధంగా అప్రతిష్టపాలు చేశావో ఎవరూ మరిచిపోలేదు. కాబట్టి ఈ రోజు ఎవరో ఏమో అన్నారని దొంగ ఏడ్పులు ఏడ్చే నిన్ను జాలితో చూడరనే విషయం తెలుసుకో.
నీ సోషల్ మీడియాతో ఎంతగా దుష్ప్రచారం చేశావో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే వున్నారు. చంద్రబాబునాయుడు ఈ రోజు నేను చాలాచాలా హ్యాపీగా వున్నాను. ఎందుకంటే ఒక మహిళ అని కూడా చూడకుండా, మీ కోసం 10 సంవత్సరాలు పని చేసిన వ్యక్తినని కూడా చూడకుండా నా వ్యక్తిత్వాన్ని బద్నాం చేశారు.
రూల్స్‌కి విరుద్ధంగా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశావు. మహిళా పార్లమెంట్‌కు పిలిచి నన్ను డీటైన్ చేసి , 24 గంటలు మానసిక క్షోభకు గురి చేసి, హైదరాబాద్‌లో విసిరి పారేయడాన్ని ఈ రాష్ట్రంలో ఎవరూ మరిచిపోరు. కావున నువ్వు ఏడ్పించిన ప్రతి ఒక్కరి ఏడ్పు నీకు తగిలింది. అందరి ఉసురు తగిలి ఈ రోజు ఇలా అయిపోయావు.
నన్నైతే రూల్స్‌కు విరుద్ధంగా ఏడాది సస్పెండ్ చేయగలిగావు. కానీ దేవుడు నిన్ను రెండున్నర సంవత్సరాలు కాదు కదా, జీవితంలోనే అసెంబ్లీలో అడుగు పెట్టనని నీకు నువ్వే శపథం చేసుకున్నావు. బాయ్‌బాయ్ బాబూ..బాయ్‌బాయ్” అని రోజా దూకుడుగా మాట్లాడ్డం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో మరి!