ఎందుకు బరువు తగ్గాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బరువు ఎందుకు తగ్గుతారు? దీనికి చాలా తక్కువ సమాధానాలొస్తాయి. ఆరోగ్యంగా ఉండడం కోసం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు చాలామంది. ఇది కామన్ ఆన్సర్. అమ్మాయిలైతే అందం కోసం బరువు తగ్గుతుంటారు. ఇంతకుమించి పెద్దగా కారణాలేం…

బరువు ఎందుకు తగ్గుతారు? దీనికి చాలా తక్కువ సమాధానాలొస్తాయి. ఆరోగ్యంగా ఉండడం కోసం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు చాలామంది. ఇది కామన్ ఆన్సర్. అమ్మాయిలైతే అందం కోసం బరువు తగ్గుతుంటారు. ఇంతకుమించి పెద్దగా కారణాలేం ఉండవు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం అమాంతం 5 కిలోలు బరువు తగ్గాడు. అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం అంతకంటే కాదు. ఓ దొంగతనం చేయడం కోసం బరువు తగ్గాడు.

అవును.. మోతీసింగ్ చౌహాన్ అనే వ్యక్తి దొంగతనం చేయడం కోసం బరువు తగ్గాడు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన ఈ వ్యక్తి.. అహ్మదాబాద్ లోని మోహిత్ మరాడియా అనే ధనవంతుడి ఇంట్లో కొన్నాళ్లు పనిచేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మానేశాడు. అయితే పని మానేసినా, అతడి మైండ్ లో మాత్రం మోహిత్ ఇంట్లో ఉన్న ధనం, బంగారం ఎలా కొట్టేయాలనే అంశంపైనే రన్ అవుతోంది.

మోహిత్ ఇంట్లో పనిచేసిన టైమ్ లో అన్ని గదులు, అన్ని లొసుగులు గమనించాడు మోతీ సింగ్. సీసీ కెమెరాల కంటికి కనిపించని ప్రాంతాన్ని గుర్తించాడు. అదొక చిన్న గాజు కిటికీ. అందులోంచి ఇంట్లోకి వెళ్తే, సీసీ కెమెరాకి దొరకరు. అయితే ఆ కిటికీ నుంచి అందరూ వెళ్లలేరు. కాస్త బక్కపల్చగా ఉన్న వ్యక్తి మాత్రమే దూరగలడు.

దీంతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు మోతీ సింగ్. మూడు నెలల పాటు, రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేశాడు. అలా తన బరువును 5 కిలోలు తగ్గించుకున్నాడు. ఇక కిటికీలో పడతానని నమ్మకం కుదిరిన వెంటనే పథకాన్ని అమలు చేశాడు. మోతీసింగ్ ఊహించినట్టే అతడి శరీరం కిటికీలో పట్టింది. అన్నీ తెలిసిన ఇల్లు కాబట్టి, చకచకా అన్నీ సర్దేశాడు. క్షణాల్లో 13 లక్షల రూపాయలు కొట్టేశాడు.

అయితే ఇంత కష్టపడి దొంగతనం చేసినప్పటికీ పోలీసులకు దొరికిపోయాడు మోతీసింగ్. కిటికీని పగలగొట్టడానికి ఉపయోగించిన వస్తువును అతడు అక్కడే మరిచిపోయాడు. దాని ఆధారంగా మోతీసింగ్ జాడ కనిపెట్టారు పోలీసులు. అలా 3 నెలలు కష్టపడి సంపాదించుకున్న స్లిమ్ ఫిజిక్ తో ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు సింగ్.