ఎక్కువమంది భారతీయులు వాడే పాస్ వర్డ్స్ ఇవే

మీ ఖాతాకు iloveyou అనే పాస్ వర్డ్ పెట్టుకున్నారా..? పోనీ krishna, sairam అనే పదాల్ని పాస్ వర్డ్స్ గా పెట్టుకున్నారా..? అయితే దేశంలో మీ అంత అమాయకులు ఎవ్వరూ లేనట్టే. అవును.. ఇండియాలో…

మీ ఖాతాకు iloveyou అనే పాస్ వర్డ్ పెట్టుకున్నారా..? పోనీ krishna, sairam అనే పదాల్ని పాస్ వర్డ్స్ గా పెట్టుకున్నారా..? అయితే దేశంలో మీ అంత అమాయకులు ఎవ్వరూ లేనట్టే. అవును.. ఇండియాలో అత్యథికులు తమ ఖాతాలకు, గూగుల్ ఎకౌంట్లకు ఈ పాస్ వర్డ్స్ పెట్టుకుంటున్నారు. ఈ మేరకు నార్డ్ పాస్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది.

గతంలో ఇండియాలో ఎక్కువగా చలామణి అయిన పాస్ వర్డ్ “12345”. కొన్ని లక్షల మంది ఈ పాస్ వర్డ్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడా స్థానాన్ని మరో పదం ఆక్రమించింది. అదే password. అవును.. చాలామంది ఇప్పుడు password అనే పదాన్ని తమ ఖాతాలకు పాస్ వర్డ్ గా పెట్టుకుంటున్నారు.

పేరుకు చివర్న 123 అనే అంకెలు తగిలించడం, ఇంటిపేరును తగిలించడం, పుట్టినతేదీని యాడ్ చేసి పాస్ వర్డ్ క్రియేట్ చేయడం లాంటివి ఎక్కువమంది భారతీయులు చేస్తున్న పని. ఇలా చేస్తే గుర్తుంచుకోవడం చాలా సులభం అవుతుందనేది చాలామంది భావన. కానీ ఇలాంటి కాంబినేషన్లు క్రాక్ చేయడం హ్యాకర్లకు సెకెండ్ పని అంటున్నారు నిపుణులు. గమ్మత్తుగా ఇండియా తర్వాత ఎక్కువగా ఇలాంటి కాంబినేషన్లతో పాస్ వర్డ్స్ పెట్టుకుంటున్న దేశం జపాన్. ఆ దేశంలో కూడా జనాలు, ఇండియన్స్ నే ఫాలో అవుతున్నారు.

వీటితో పాటు 'iloveyou', 'sweetheart', 'sunshine', 'lovely', 'qwerty' 'abc123'లాంటి పదాల్ని కూడా ఎక్కువమంది ఇండియన్స్ తమ పాస్ వర్డ్స్ గా వాడుతున్నారు. ఈ పాస్ వర్డ్స్ అన్నింటినీ హ్యాకర్లు ఒక సెకెండ్ కంటే తక్కువ సమయంలోనే క్రాక్ చేస్తున్నారని సదరు సంస్థ నిర్థారించింది.

చాన్నాళ్లుగా ఇలాంటి పాస్ వర్డ్స్ వాడుతున్న వినియోగదారులంతా వీలైనంత తొందరగా వాటిని మార్చుకోవాలని, లేదంటే నష్టపోక తప్పదని సంస్థ హెచ్చరిస్తోంది. పాస్ వర్డ్ లో అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులు ఉండేలా చూసుకోవాలని సూచిస్తోంది.