Hunt Review: మూవీ రివ్యూ: హంట్

చిత్రం: హంట్ రేటింగ్: 2/5 తారాగణం: సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ తదితరులు  కెమెరా: అరుళ్ విన్సెంట్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి  సంగీతం: గిబ్రాన్ నిర్మాత: ఆనంద్ ప్రసాద్ దర్శకత్వం: మహేష్ సూరపనేని విడుదల…

చిత్రం: హంట్
రేటింగ్: 2/5
తారాగణం: సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ తదితరులు 
కెమెరా: అరుళ్ విన్సెంట్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి 
సంగీతం: గిబ్రాన్
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
దర్శకత్వం: మహేష్ సూరపనేని
విడుదల తేదీ: 26 జనవరి 2023

సుధీర్ బాబు గతంలో పోలీసాఫీసర్ పాత్రలు చేసాడు. అయితే ఇది కాస్త భిన్నమైనది. 

కథలోకి వెళ్లితే ముగ్గురు పోలీసాఫీసర్స్ స్నేహితులు. అందులో ఒకతను హత్యకు గురౌతాడు. హంతకుడెవరో శోధించే పనిలో ఆ ముగ్గుర్లో ఒకడైన మన హీరోకి యాక్సిడెంటౌతుంది. ఆ దెబ్బకి గతం కొంత మర్చిపోతాడు. అంటే సింపుల్ గా తనని, తన మనుషుల్ని మర్చిపోతాడు. తక్కినవన్నీ బ్రహ్మాండంగా గుర్తుంటాయి. దానికి జస్టిఫికేషన్ ఇస్తూ ఒక డాక్టర్ తో సీన్ పెట్టారు. ఆవిడ చెప్పింది కళ్లు మూసుకుని నమ్మేసి కళ్ళు తెరుచుకుని ఈ సినిమా చూసెయ్యాలంతే. సినిమా తీయడం కోసం మరీ ఇంత అనుకూలమైన సెలెక్టివ్ మెమరీ లాస్ ని హీరోకి పెట్టడం మళయాళ మాతృకలోనే ఉంది. దానిని యథాతధంగా మనం తీసేసుకున్నమంతే. 

ఇక విషయంలోకి వెళితే స్క్రిప్ట్ రాసుకోవడంలో చాలా తేడాలు కనిపిస్తాయి. అసలు ఆర్మీ అంటే ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అనేది ఏ మాత్రం రీసెర్చ్ చేయకుండా తీసిన హాఫ్ నాలెడ్జ్ సినిమా ఇది. 

అయినా 2013లో వచ్చిన “ముంబాయి పోలీస్” అనే మళయాళ చిత్రం 2023లో రీమేక్ గా తీస్తున్నప్పుడు పెరిగిన ఆడియన్స్ స్టాండర్డ్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని తీయాలి కదా. మాతృకలో ఉన్నట్టే చేసామంటే సరికాదు. ఒరిజినల్లో ఉన్నదంతా పర్ఫెక్ట్ అనుకోవడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఎంత చూసి కాపీ కొట్టినా కనీసమైన రీసెర్చ్ చేసుకోవాలి కదా. 

ఆర్మీలో మేజర్ ర్యాంక్ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్ లో జిల్లా ఎస్పీ కి సమానమైన ర్యాంక్. మేజర్ పైన లెఫ్టనెంట్ కల్నల్, ఆపైన కల్నల్ ఉంటారు. అంటే అది ఎంత పెద్ద ర్యాంకో కనీస అవగాహన లేకుండా సీన్లు పెట్టడం ఆశ్చర్యకరం. అలాగే ఒక ఆర్మీ ఆఫీసర్ “ఆర్మీ అంటే ఏంటో చూపిస్తా” అని పోలీసులకి ధంకీ ఇచ్చి లోకల్ గూండాలని వెనకేసుకొచ్చి ఫైటింగ్ చేయడమేంటో అర్థం కాదు. ఎంత “బాబు”గారి హీరోయిజం చూపించాలంటే మాత్రం మరీ ఇంత చిల్లరగా తియ్యాలా? అలాగే టెర్రరిస్టులతో చేసే ఫైటింగుల్లో కూడా మాస్ హీరోయిజం చూపించికోవాలనే తపన తప్ప ఏ మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. 

ఇక ఆ బేసిక్స్ పక్కన పెడితే క్లైమాక్సులో 15 నిమిషాల ట్విస్ట్ తో కూడిన కథ ఉంది కదా అని దానికి ముందు 2 గంటల సేపు నీరసమైన కథనాన్ని భరించమంటే చాలా కష్టం. స్క్రీన్ ప్లే ని మరింత టైట్ చేసి ఆద్యంతం ఉత్కంఠగా నడిపేలాగ, బలమైన ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చేలాగ కసరత్తు చెయ్యకపోవడం ఇందులో ప్రధానమైన మైనస్. 

టెక్నికల్ గా చూసుకుంటే సంగీతం పరమ వీక్. ఐటం సాంగైతే మరీ సి-గ్రేడ్ గా ఉంది. నేపథ్య సంగీతం కూడా బిలో యావరేజ్. కెమెరా వగైరాలు ఓకే. ఎంత రెండుంపావు గంట‌ల్లో పూర్తైనా ఎడిటర్ ఇంకొంచెం కత్తెరించుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా టెర్రరిస్టులతో అంత పొడవైన ఫైటింగ్ సీన్లు అవసరం లేదు. 

సుధీర్ బాబు ఒక పక్కన సిన్సియర్ గా కథని నమ్ముకుని కనీసం హీరోయిన్ ని కూడా పెట్టుకోకుండా నటించినట్టు కనిపించినా మరొక పక్కన అక్కర్లేని ఫైటింగ్ సీన్స్ అవీ పెట్టి మాస్ హీరో అనిపించుకోవాలనే ఆరాటం కూడా కనపడింది. 

భరత్ నివాస్, శ్రీకాంత్ తమ తమ పాత్రల్లో బాగానే ఒదిగారు. స్త్రీపాత్రలకు పెద్దగా స్కోప్ లేని ఈ సినిమాలో రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే శ్రీకాంత్ భార్య పాత్రకి, భరత్ వుడ్-బీ పాత్రకి డైలాగ్స్ పెట్టారు. మిగిలిన ప్యాడింగ్ ఆర్టిస్టులు ఓకే. 

హంతకుడెవరో శోధించే సినిమాలు ఇప్పటివి కాదు. దశాబ్దాల నుంచి ఉన్నాయి. కనుక పలు పాత్రలమీద అనుమానం రేకెత్తించే విధంగా సీన్స్ రాసుకోవడం కూడా మామూలే. అయితే అవి ఎంత కన్విన్సింగ్ గా ఉన్నాయి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా కూర్చోబెడతాయా లేదా అనే అంచనా ఉండాలి. అదేమీ జరగలేదు. 

పాయింట్ బాగుంది కదాని తీసేసి ప్రేక్షకుల ముందు పాయింట్ బ్లాంక్ లో కూర్చున్నట్టయ్యింది. 

బాటం లైన్: గురి తప్పింది