సెప్టెంబర్ నెల టాలీవుడ్‌కు భలే షాక్‌లు ఇస్తోంది. ఈనెల 28న సలార్ విడుదల కావాల్సి వుంది. అందుకే ఆ డేట్‌కు ఎవరూ రుమాళ్లు వేయలేదు. అంతే కాదు, దానికి ముందు వారం కూడా ఎవ్వరూ సినిమాలు వేయలేదు.
కానీ ఇంతలో ఏమయింది. సలార్ వాయిదా పడింది. అధికారికంగా బయటకు ప్రకటించలేదు. బయ్యర్లకు చెప్పారు. దాంతో హడావుడిగా మూడు సినిమాలు సలార్ డేట్ కు పరుగెత్తాయి. 15న కంఫర్ట్ గా వున్న డేట్ ను వదలుకుని రామ్-బోయపాటి స్కంధ కూడా అటే పరుగులు తీసింది.
కానీ ఇప్పుడు మళ్లీ మరో షాక్. సెప్టెంబర్ 15 న రావాల్సిన చంద్రముఖి 2 కూడా వాయిదా పడింది. అక్కడ సరైన సినిమా లేకుండా పోయింది ఇప్పుడు. కేవలం విశాల్ డబ్బింగ్ సినిమా మాత్రమే మిగిలింది. ఈవారం విడుదలైన తెలుగు సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ శెట్టి, గత వారం విడుదలైన ఖుషీ థియేటర్లలో వున్నాయి. జవాన్ సినిమా వీటికి అదనం.
వీటితోటే ఈ నెలాఖరు వరకు బండి లాగించాలి. నెలాఖరున మొత్తం సినిమాలు ఒకేసారి వచ్చి కొట్టేసుకుంటాయి. నిర్మాతల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ప్లానింగ్ లేకపోవడం వల్ల సరైన మాంచి డేట్ లు ఖాళీగా వుండిపోయాయి. థియేటర్లు వెల వెల పోతాయి ఇప్పుడు.