రూల్స్ రంజన్ అనే టైటిల్ వినగానే, ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ పై ఎవరికైనా ఓ ఐడియా వచ్చేస్తుంది. కుర్రాడు పద్ధతిగా ఉంటాడని, రూల్స్ ప్రకారం పోతాడని ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఇలాంటి వ్యక్తి కాస్తా పబ్ రంజన్ గా మారతాడు. అమ్మాయితో కలిసి రోజూ మందు కొట్టే కార్యక్రమం పెట్టుకుంటాడు. దీనికి కారణం ఏంటి?
ఈరోజు రూల్స్ రంజన్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో అతడి పాత్ర పేరు మనోరంజన్. ఇతగాడ్ని అంతా రూల్స్ రంజన్ అని పిలుస్తారు. ఇలాంటి వ్యక్తి, హీరోయిన్ కారణంగా పబ్ రంజన్ గా మారాడు. ట్రయిలర్ మొత్తం కామెడీ టచ్ ఇచ్చారు.
“ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?” అంటూ గోపరాజు రమణ అడిగే డైలాగ్ తో ట్రయిలర్ గమ్మత్తుగా స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ్నుంచి మ్యాగ్జిమమ్ కామెడీ పంచే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది.
ఓవరాల్ గా రూల్స్ రంజన్ సినిమా వంద శాతం వినోదాన్ని అందిస్తుందనే మెసేజ్ ను ట్రయిలర్ తో అందించే ప్రయత్నం చేశారు. ట్రయిలర్ లో రూల్స్ రంజన్ గా కిరణ్ అబ్బవరం సింపుల్ గా కనిపించాడు. హీరోయిన్ నేహా శెట్టి మరోసారి, డీజే టిల్లూ టైపులో టిపికల్ పాత్రలో కనిపించినట్టుంది.
రీసెంట్ గా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన కిరణ్ అబ్బవరం, ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. 28న థియేటర్లలోకి వస్తోంది రూల్స్ రంజన్ మూవీ.