వయసు అయిపోయిందన్నారు.. స్టార్ డమ్ తగ్గిందంటూ కామెంట్స్ చేశారు… రిటైర్మెంట్ తీసుకోవాలంటూ ఉచిత సలహాలిచ్చారు. అన్నింటినీ భరించాడు. పఠాన్ తో అందరికీ జవాబు చెప్పాడు. ఇప్పుడు జవాన్ తో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు షారూక్ ఖాన్.
కింగ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా దేశవ్యాప్తంగా దుమ్ముదులుపుతోంది. ఓపెనింగ్స్ లో ఈ సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. హిందీ సినిమాలకు సంబంధించి బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ మూవీ. జవాన్ సినిమాకు మొదటి రోజు 65 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ వచ్చింది. ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్.
షారూక్ నటించిన పఠాన్ సినిమాకు మొదటి రోజు 55 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఈ సినిమా కంటే 10 కోట్ల రూపాయలు ఎక్కువ వసూలు చేసింది జవాన్. పఠాన్ సినిమా సక్సెస్ అవ్వడం వల్లనే జవాన్ సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ వచ్చింది.
హిందీ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం జవాన్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పఠాన్, మూడో స్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో వార్, ఐదో స్థానంలో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలున్నాయి.
షారూక్ సొంత బ్యానర్ రెడ్ ఛిల్లీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు మంచి రివ్యూస్ వచ్చాయి. దీనికితోడు లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. ఫలితంగా మొదటి వారాంతం గడిచేసరికి జవాన్ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.