విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీలో అసమ్మతి నాయకుడిగా గుర్తింపు పొందారు. అప్పుడప్పుడు సొంత పార్టీ నాయకులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాదు, వైసీపీ ఎమ్మెల్యేలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ, వారిపై ప్రశంసలు కురిపిస్తుండడం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. నారా లోకేశ్ పాదయాత్ర విజయవాడ లోక్సభ పరిధిలో సాగుతున్నా, కేశినేని నాని మాత్రం అటు వైపు కన్నెత్తి చూడలేదు.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పోటీపై కేశినేని నాని శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలోనే తాను ఉన్నట్టు స్పష్టం చేశారు. అలాగే రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపునే విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని నాని తేల్చి చెప్పారు. చంద్రబాబునాయుడిపై ఆయన ప్రశంసలు కురిపించడం విశేషం.
చంద్రబాబునాయుడు చాలా నిజాయతీపరుడని కేశినేని నాని కొనియాడారు. 40 సంవత్సరాల చంద్రబాబు రాజకీయంలో అవినీతి మచ్చ ఆయన్ను తాకలేదన్నారు. ఐటీశాఖ చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడాన్ని కేశినేని లైట్ తీసుకున్నారు. అదేం పెద్ద సంగతి కాదని కొట్టి పారేశారు. చంద్రబాబుపై కేశినేని స్వరంలో మార్పు వచ్చింది. ఇటీవల టీడీపీ అధిష్టానం ఎదవలకు ప్రాధాన్యం ఇస్తోందని కేశినేని నాని ఘాటు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా నిలబడుతానని ఆయన చెప్పారు. ప్రజలకు సేవ చేసిన వాళ్లనే ఆదరిస్తారని చెప్పుకొచ్చారు.
లోకేశ్ నాయకత్వం విషయంలో అసంతృప్తిగా ఉండే కేశినేని నాని, బాబు విషయానికి వచ్చే సరికి సానుకూల వైఖరితో వుంటున్నారు. బాబు ఢిల్లీకి వెళితే, ఆయన వెంటే వుంటారు. కానీ లోకేశ్ పాదయాత్రలో టీడీపీ ఇద్దరు ఎంపీలు గల్లా జయదేశ్, కేశినేని పాల్గొనకపోవడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. కానీ ఏమీ అనకపోయినప్పటికీ, రేపు టికెట్ల విషయంలో చూసుకోవచ్చనే భావనలో ఉన్నట్టు చెబుతున్నారు. మరి కేశినేని నానికి టికెట్ ఇస్తారా? అంటే అనుమానమే అని చెప్పొచ్చు.