2024లో విజయమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు చేస్తున్నారు. పలు సంస్థలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తూ, వాటి నివేదికల ఆధారంగా టికెట్లు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్నగాక మొన్న టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావ్‌కు గన్నవరం టికెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ గెలుపొంది, ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచారు.
దీంతో గన్నవరంలో టీడీపీకి సరైన అభ్యర్థి దొరకలేదు. వంశీపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్‌కు వైసీపీలో టికెట్‌పై హామీ దక్కలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరడం, వెంటనే టికెట్ దక్కించుకోవడం గమనార్హం. అలాగే నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్‌గా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ 120 నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో బాగా చేసుకుని విజేతలుగా తిరిగి రావాలని ఆశీస్సులు ఇచ్చి పంపారు.
ఇక తేల్చాల్సింది కేవలం 55 నియోజకవర్గాల అభ్యర్థులనే. మరోవైపు జనసేనతో పొత్తు వ్యవహారం ఎటూ తేలకుండా వుంది. జనసేనతో సంబంధం లేకుండానే చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేస్తుండడంపై పవన్ కల్యాణ్ గుర్రుగా ఉన్నారని సమాచారం. అయితే 55 సీట్లపై స్పష్టత ఇవ్వకుండా పవన్‌తో చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడనున్నారు. ప్రధానంగా ఈ 55 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయకపోవడానికి ప్రత్యేక కారణం వున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం బహుముఖ పోటీ, మరికొన్ని చోట్ల వైసీపీ నుంచి కొందరు వచ్చే అవకాశం ఉండడం, చివరి చాయిస్‌గా జనసేన కోసం కొన్ని సీట్లను మిగిల్చినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. జనసేనకు మరీ ప్రాధాన్యం ఇచ్చే సీన్ వుండదని టీడీపీ నేతల వాదన. జనసేనకు మొక్కుబడిగా సీట్లు కేటాయించి, ఆ పార్టీ నుంచి అత్యధికంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో టీడీపీ ముందుకు సాగుతోంది.
కావున 55 సీట్లలో టీడీపీ అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పెట్టడం అంటే… జనసేన కోసం అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి వుండదు. చంద్రబాబు చాలా స్పష్టంగా సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.