పవన్‌ కళ్యాణ్‌.. దీన్ని రాజకీయం అంటారా.?

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. సరికొత్త రాజకీయాలు చేస్తానని చెబుతున్నారు చాలాకాలంగా. బహుశా సరికొత్త రాజకీయాలంటే సోషల్‌ మీడియా రాజకీయాలేమో.! 'ఏ విషయమ్మీద అయినా అడ్డగోలుగా విమర్శలు చేయం.. కన్‌స్ట్రక్టివ్‌గా వ్యవహరిస్తాం..'…

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. సరికొత్త రాజకీయాలు చేస్తానని చెబుతున్నారు చాలాకాలంగా. బహుశా సరికొత్త రాజకీయాలంటే సోషల్‌ మీడియా రాజకీయాలేమో.! 'ఏ విషయమ్మీద అయినా అడ్డగోలుగా విమర్శలు చేయం.. కన్‌స్ట్రక్టివ్‌గా వ్యవహరిస్తాం..' అని గత ఐదేళ్ళూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే, అప్పట్లోనూ ఆయన కన్‌స్ట్రక్టివ్‌ రాజకీయాలు చేయలేదు. నారా లోకేష్‌ మీద ఆరోపణలు చేశారు.. నిరూపించాల్సి వస్తే, 'ఎవరో అనుకుంటున్నారు' అని సెలవిచ్చారు. 'మాటకు కట్టుబడి వుండలేకపోవడం' అనేది జనసేనాని 'వీక్‌ పాయింట్స్‌'లో అతి ముఖ్యమైనది.

చంద్రబాబు హయాంలో.. టైమ్‌ పాస్‌ రాజకీయాలు చేసిన పవన్‌ కళ్యాణ్‌, ఇప్పుడు సీరియస్‌ రాజకీయాలు చేసేస్తున్నారు. రాజకీయ పార్టీ అన్నాక రాజకీయాలే చేయాలి. కానీ, సోషల్‌ మీడియా రాజకీయాలేంటి.? ఎవరో ఎక్కడో ఓ ఫొటో పెడతారు.. దాన్ని రీ-ట్వీట్‌ చేయడం.. ఏదన్నా పత్రికలో ఓ కథనం వస్తే.. దాన్ని తన ట్వీట్‌లో ప్రస్తావించడం.. ఇదా రాజకీయం.? సినీ నటుడిగా పవన్‌ కళ్యాణ్‌కి వున్న ఫాలోయింగ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఆ ఫాలోయింగ్‌ తనకు ఓట్లు తెచ్చిపెట్టలేదని పవన్‌ కళ్యాణే స్వయంగా ఒప్పుకున్నారు. మరి, ఆ అభిమానుల్ని అలరించేందుకు సోషల్‌ మీడియా రాజకీయాలు చేస్తే ఎలా.?

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరు నెలల పాలనపై పవన్‌ 'సిక్స్‌ వర్డ్స్‌' ప్రస్తావించారు. విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నము.. అంటూ తన తెలుగు పాండిత్యాన్ని వినియోగించేశారు. వైఎస్‌ జగన్‌ పాలనలో తప్పుల్ని ప్రశ్నించడం విపక్షంగా జనసేన బాధ్యతే.. ఆ బాధ్యతని కాదనలేం. కానీ, కొత్త ప్రభుత్వం.. పైగా తొలి సారి ముఖ్యమంత్రి అయిన జగన్‌.. కనీసం ఆరు నెలలు సమయం అయినా అధికార పక్షానికి ఇవ్వాలన్న ఇంగితం లేకపోతే ఎలా.?

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక పరిస్థితుల్లో వుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఈ తరుణంలో విపక్షాల ఒకింత సంయమనం పాటించడం అనేది హుందాతనం. ప్రశ్నించడం తప్పు కాదు.. ప్రశ్నించే క్రమంలో.. అడుగడుగునా వికృత రాజకీయాలు చేయడమే దుర్మార్గం. టీడీపీ, జనసేన.. ఆ మాటకొస్తే బీజేపీ కూడా ఇప్పుడు ఏపీలో చేస్తున్నది అదే. 'కన్‌స్ట్రక్టివ్‌ రాజకీయం' అనేది ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ తీరు.. మరింత హాస్యాస్పదంగా మారిపోతోంది.