టాలీవుడ్ అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరినైనా ఎంత మాటైనా అనేస్తారు. అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని ఆయన అన్నారంటే….బాలయ్య తెంపరితనం గురించి ఏం చెప్పాలి? తాజాగా అక్కినేని నాగేశ్వరరావుపై వీరసింహారెడ్డి సక్సెస్ మీటలో బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
బాలయ్య దుందుడుకు తనంపై అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలయ్యకు సమాధానంగా ఇద్దరూ ఒకే విషయాన్ని తమతమ ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడం గమనార్హం. అక్కినేనిపై బాలయ్య ఏమని నోరు పారేసుకున్నారో తెలుసుకుందాం. వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో తన పక్కనున్న వ్యక్తి గురించి బాలయ్య చెబుతూ… ‘ఈయన సెట్లో వున్నాడంటే ఏదో ఒకటి… ఆ రంగారావు…ఈ రంగారావు ..అక్కినేని..తొక్కినేని’ అంటూ లెక్కలేకుండా నోటి దురుసు ప్రదర్శించారు. తమ తాతను అవమానించిన బాలయ్యకు బుద్ధి చెప్పడానికి అన్నట్టు… అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఎంతో గౌరవంగా హితవు చెప్పారు.
“నందమూరి తారక రామరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరపరచటం మనల్ని మనమే కించపరుచుకోవడం” అని ఓ పోస్టును ట్వీట్ చేశారిద్దరూ. అక్కినేని, ఎస్వీ రంగారావును అవమానించామని అనుకుంటే పొరపాటు, నిన్ను నీవు కించపరుచుకున్నావని బాలయ్యకు సుతిమెత్తగానే చీవాట్లు పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో టాలీవుడ్లో కొత్త వివాదం రగిలినట్టైంది. నోరు జారడం, సారీ చెప్పడం బాలయ్యకు అలవాటైన విద్య. ఇటీవల ఓ సామాజిక వర్గం గురించి ఇట్లే మాట్లాడి, ఆ తర్వాత బహిరంగ క్షమాపణం చెప్పడం తెలిసిందే. మరి అక్కినేని విషయంలో తన తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకుంటారేమో చూడాలి.