టాలీవుడ్ లో ఓ ఇంట్రస్టింగ్ గ్యాసిప్ వినిపిస్తోంది. మైత్రీ మూవీస్ దగ్గరే వున్న ఇద్దరు మాస్ డైరక్టర్లు అటు ఇటు మారతారు అంటూ వినిపిస్తున్న ఈ గ్యాసిప్ ఎంత వరకు నిజం అన్నది తెలియదు. విషయం ఏమిటంటే దర్శకుడు హరీష్ శంకర్ చాలా కాలంగా మైత్రీ మూవీస్ దగ్గర వున్నారు.
పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఆయన వేచి వున్నారు. ఇటీవలే పూజ కూడా జరిగింది. అయితే పవన్ ఎప్పుడు వస్తారు అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. అసలు ఈ ఏడాది రావడానికి వీలు అవుతుందా అన్న అనుమానం వుండనే వుంది.
ఇదిలా వుంటే వీరసింహారెడ్డితో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని మరో సినిమా కూడా మైత్రీలో చేయబోతున్నారని బోగట్టా. గోపీచంద్ కు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కోరిక వుంది. భీమ్లా నాయక్ చేయాలని ప్రయత్నించారు కానీ వీలు కాలేదు.
ఇదిలా వుంటే బాలయ్య తో సినిమా చేయాలని హరీష్ శంకర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మాటను, ఆ కోరికను బాహాటంగా స్టేజ్ మీదే వెలిబుచ్చారు. తన నిర్మాతలు కూడా రెడీగా వున్నారని చెప్పేసారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య ఊ అంటే హరీష్ రెడీ అంటారు.
అందుకే బహుశా ఈ గ్యాసిప్ వినిపిస్తోందేమో? హరీష్ శంకర్ ను బాలయ్య సినిమా మీదకు మార్చి, గోపీచంద్ ను పవన్ సినిమా మీదకు మారుస్తారు అన్న గ్యాసిప్ పుట్టిందేమో? ఇలా అయితే హరీష్ కు వెయిటింగ్ తప్పుతుంది. గోపీచంద్ కు ఎలాగూ టైమ్ అవసరం కనుక, సరిపోతుంది. చూడాలి ఈ గ్యాసిప్ నిజంగా ఎప్పుడు మారుతుందో?