ఎట్టకేలకు యాత్రకు వారాహి సిద్ధమైంది. మరి జనసేనాని పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధంగా ఉన్నారా? అనేదిప్పుడు చర్చనీయాంశమైంది. ఏపీలో టీడీపీతో పొత్తు కుదుర్చుకోడానికి జనసేనాని మానసికంగా సిద్ధమయ్యారు. మరోవైపు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారో అనే జనసేన శ్రేణుల్లో టెన్షన్. పవన్‌కైతే ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే. గౌరవప్రద మైన సీట్లు ఇస్తేనే… పొత్తు అని పవన్ తమ కార్యకర్తల్ని ఓదార్చడానికి తప్ప, ఆయనకైతే ఆ పట్టింపులేమీ లేనట్టే కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి పర్యటన చేపడతారో తెలియాల్సి వుంది. తాజాగా తనకెంతో ఇష్టమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు కూడా పూర్తి చేశారు. ఇక ఎన్నికల సమరమే మిగిలి వుంది. ఈ వాహనం మీదుగా జగన్‌పై ఆయన అస్త్రశస్త్రాలను సంధించనున్నారు.
జగన్‌పై యుద్ధంలో గెలవడానికి దైవ బలాన్ని సమీకరించే పనిలో పవన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీలక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అనుష్టుప్ నారసింహ యాత్రను ప్రారంభించి, మొత్తం 32 నారసింహ క్షేత్రాలను దర్శించుకోనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత బహుశా ఎన్నికల సమరాన్ని మొదలు పెట్టే అవకాశాలున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే ప్రజల్లో గడపడానికే ప్రాధాన్యం ఇస్తారా? లేక పూర్తి కాలాన్ని ఖర్చు చేస్తారా? అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. జగన్‌ను గద్దె దించాలనే నిబద్ధతలో మాత్రం మార్పు లేదు.
జగన్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. కేవలం వ్యక్తిగత ద్వేషంతోనే జగన్‌పై ఆయన రగిలిపోతున్నారనే అభిప్రాయం వుంది. తనొక్కడి వల్ల జగన్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదనే విషయంలో ఆయన క్లారిటీతో ఉన్నారు. అన్నీ సరే, ఇంతకూ జగన్‌పై యుద్ధానికి ముహూర్తం ఎన్నడు? అనేదే ప్రశ్న. దానికి పవన్ మాత్రమే సమాధానం చెప్పాల్సి వుంది.