ప్రముఖ సామాజికవేత్త, మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కుమార్తె దండి ప్రియాంకరావు రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఆసక్తి చూపుతున్నారని సమాచారం. విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె ఉత్సాహం చూపుతున్నారని తెలిసింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఆమె విరివిగా పాల్గొంటున్నారని సమాచారం. విశాఖలో విద్యాభ్యాసం, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రియాంక ఆ నగరంపై మమకారం పెంచుకున్నారు. విశాఖ నగరవాసులకు తన వంతుగా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలైతే సరైన వేదికని ఆమె నమ్ముతున్నారు.
సీబీఐ అధికారిగా లక్ష్మీనారాయణ పాపులారిటీ సంపాదించుకున్నారు. సీబీఐలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) హోదానే ఆయన ఇంటి పేరైంది. మంచి సమాజం కోసమంటూ ఆయన తపిస్తుంటారు. రాజకీయాలు అంటరానివి కావనేది ఆయన అభిప్రాయం. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ లోక్సభ స్థానం నుంచి జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ విశాఖ కేంద్రంగా అడపాదడపా ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
తండ్రిలాగే కుమార్తె కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదిలా వుండగా జేడీ లక్ష్మీనారాయణ కూడా విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఫలానా పార్టీ అని ఆయన చెప్పలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలో దిగుతానని అంటున్నారు.
అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకునే అవకాశాలుంటే… బీజేపీ నుంచి తాను ఎంపీగా, కుమార్తెను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలపాలని ఆయన ఆలోచిస్తున్నారని జేడీ దగ్గరి వాళ్లు చెబుతున్నారు. విశాఖలో కుమార్తెకు ఏ నియోజకవర్గమైనా ఫర్వాలేదని జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారని తెలిసింది. చట్టసభలో అడుగు పెడితే, కొన్ని సంస్కరణలు తీసుకురావచ్చనేది తండ్రీతనయల అభిప్రాయం. వారి ఆకాంక్షలు ఎంత వరకు నెరవేరుతాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.