నిర్మాత, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ చిత్రపరిశ్రమ ధోరణులపై సంచలన కామెంట్స్ చేశాడు. నట్టి కుమార్ అంటే ఏ విషయాన్నైనా ధైర్యంగా మాట్లాడుతాడనే పేరు. అందుకు తగ్గట్టుగానే ఆయన అనేకమార్లు సంచలన కామెంట్స్ చేశారు. ఆ పరంపరలోనే తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మరోసారి తన పంథాను కొనసాగించాడు.
చిత్ర పరిశ్రమలో కొందరి లాబీయింగ్ వల్లే థియేటర్లు మూతపడ్డాయని తీవ్ర ఆరోపణలు చేశాడు. సినిమా రంగంలో ఎల్ఎల్ఎల్పి అనే సంస్థను 21 మంది నిర్మాతలు ప్రారంభించి సినిమా రంగాన్ని శాసిస్తున్నారని మండిపడ్డాడు. పిఠాపురం థియేటర్లో ఫర్నీచర్ దొంగల పాలైందన్నాడు. అలాగే మరికొన్ని చోట్ల ఎలుకల వల్ల కుర్చీలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా థియేటర్ల మూతవల్లే జరిగిందని, దీనికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించాడు.
థియేటర్ల మూతవల్ల అనేక మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. రైళ్లు, విమానాల్లో సీటింగ్ కెపాసిటీ మార్చకుండా ఉన్న వాటితోనే రన్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశాడు. మరి సినిమా థియేటర్ల దగ్గరికి వచ్చే సరికి నిబంధనలు ఎందుకు మారాయి? అని ఆయన ప్రశ్నించాడు. కరోనా కారణం చూపి థియేటర్లు ఓపెన్ చేయకపోతే మున్ముందు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం మొదలవుతుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించాడు.
ప్రధానంగా ఓటీటీల వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయన్నాడు. థియేటర్ల మూసివేత సాకుతో ఓటీటీ ద్వారా పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించాడు. థియేటర్ల వల్లే హీరోలందరికీ కోట్ల మార్కెట్లు వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికాడు. కాగా తాను రాంగోపాల్వర్మతో కలిసి సైకోవర్మ, దెయ్యంతో సహవాసం అనే రెండు సినిమాలు నిర్మిస్తున్నట్టు నట్టి కుమార్ తెలిపాడు. నట్టి కుమార్ తాజా వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి.