బీజేపీ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అలక కొనసాగిస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ఇటీవల విడతల వారీగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కన్నా పార్టీ ధిక్కారంపై ఫిర్యాదులు వెళ్లినా అధిష్టానం మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తుండడం గమనార్హం.
ఇవాళ భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కాకూడదని కన్నా నిర్ణయించు కోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఢిల్లీలో జాతీయ కార్యవర్గాలు సమావేశాల్లో ఏపీలో బలోపేతంపై అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో ఏపీలో పొత్తులు, ఇతరత్రా రాజకీయ ముఖ్య అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించనున్నారు. ఈ కీలక సమావేశానికి కన్నా డుమ్మా కొడుతుండడంపై బీజేపీ నోరు మెదపడం లేదు.
ఒకవైపు భీమవరంలో పార్టీ ముఖ్య సమావేశం చేపట్టినా, ఆయన మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా హాజరు కాలేదు. అప్పుడు తిరుమలలో వ్యక్తిగత కార్యక్రమం ఉండడం వల్ల హాజరు కాలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆయన అలా చెప్పడం లేదు. అందరికీ అన్ని విషయాలు తెలుసంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలపై మాట్లాడ్తానని చెబుతున్నారు.
త్వరలో కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గుంటూరులోని కన్నా ఇంటికెళ్లి చర్చించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకే కన్నా ఇంటికి వెళ్లినట్టు సమాచారం. మరోవైపు పవన్‌కల్యాణ్‌కు అండగా వుంటానని కన్నా ఇటీవల బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. దీంతో ఆయన జనసేన పంచన చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.
సోము వీర్రాజుపై ఘాటు విమర్శలతో బీజేపీని కన్నా వీడనున్నారనే ప్రచారం బాగానే జరిగింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కాకపోవడంతో, ఇక ఆ పార్టీలో కన్నా ప్రస్థానం ముగిసిందనే వాదన బలపడుతోంది.