టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ పాదయాత్రకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో ప్రముఖ పుణ్య స్థలాలు, దేవాలయాలను సందర్శించి ఆశీస్సులు పొందేందుకు లోకేశ్ సిద్ధమయ్యారు. చివరిగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, దీవెనలతో పాదయాత్రకు ఒక రోజు ముందే కుప్పానికి చేరుకుంటారు. 27న ఉదయం యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తారు.
400 రోజుల్లో, 4 వేల కిలోమీటర్లు లోకేశ్ పాదయాత్ర లక్ష్యం. ఇది సాంకేతికంగా మనకు పైకి కనిపించేది. కానీ లోకేశ్ ముందున్న అసలు లక్ష్యం అదృశ్యంగా ఉంది. టీడీపీని అధికారం వైపు నడిపించడమే లోకేశ్ ముందున్న అసలు సవాల్. ఈ లక్ష్యం చేరడానికి రోజులు, కిలో మీటర్లు లెక్కలోకి రావు. లోకేశ్ సమర్థత ప్రధానం. నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడంతో పాటు టీడీపీ పాలనలోనే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే నమ్మకం, భరోసా ప్రజానీకంలో నింపాల్సి వుంది.
పాదయాత్రలో జనంతో మమేకం కావడం ద్వారా వారిని తన వెంట అధికారమనే తీరానికి నడిపించడం లోకేశ్‌కు అతి పెద్ద సవాల్. టీడీపీని అధికారం వైపు నడిపించడం అంత సులువైన వ్యవహారం కాదు. ఎందుకంటే వైఎస్ జగన్ రూపంలో అతి బలవంతుడైన ప్రత్యర్థి ఉన్నాడని లోకేశ్ గుర్తించుకోవాలి. నవరత్నాల సంక్షేమ పథకాల అమలును చిత్తశుద్ధితో అమలు చేస్తూ, పేద, బడుగు, బలహీన వర్గాల నుంచి ప్రేమాభిమానాలు పొందారు.
అన్నిటికి మించి జగన్ చెబితే మాటపై నిలబడతారనే నమ్మకాన్ని జగన్ సంపాదించుకున్నారు. కరోనా లాంటి విపత్కర సమయాల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జగన్ వెనకడుగు వేయకపోవడాన్ని గమనించొచ్చు. ఇంతకంటే జగన్ నిబద్ధతకు తార్కాణం ఏం కావాలి? అయితే సంక్షేమ పథకాల అమలుతో కొన్ని వర్గాలకు ఆయన దూరం అయ్యారన్నది కూడా నిజం. అది ఎంత మాత్రమో ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి.
మరీ ముఖ్యంగా జగన్ టీడీపీ ఓటు బ్యాంక్‌ను విచ్ఛిన్నం చేశారు. బీసీలను తన వైపు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల కూడా కాలేదు. తండ్రి చేయలేనిది తనయుడు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల్లో వైసీపీకి బలమైన పట్టు వుంది. రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తిగా ఉన్నప్పటికీ, అది ఇప్పటి వరకూ టీడీపీ వైపు టర్న్ కాలేదు. టీడీపీకి ఒక్క కమ్మ సామాజిక వర్గమే నమ్మకమైన ఓటు బ్యాంక్. కాపు, బలిజల ఓట్ల కోసం పవన్‌కల్యాణ్‌పై ఆధారపడాల్సి వస్తోంది. పవన్ నమ్మదగిన నాయకుడా? కాదా? అనేది టీడీపీ పెద్దలే తేల్చుకోవాల్సి వుంది.
ఒకవేళ జనసేనతో పొత్తు కుదరకపోతే టీడీపీ భవిష్యత్ ఏంటనేది ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాల్సి వుంది. 2019 ఎన్నికల అనుభవం నిలువెత్తు నిదర్శనంగా నిలిచి వుంది. అంతెందుకు, మంగళగిరిలో స్వయంగా లోకేశే ఓడిపోయిన దుస్థితి. ఇలా అనేక ప్రతికూల అంశాలు లోకేశ్ ఎదుట నిలిచాయి. జగన్ సర్కార్‌పై వ్యతిరేకత ఉన్న మాట నిజమే. అలాగని అది టీడీపీకి సానుకూలంగా మారలేదనే వాస్తవాన్ని గ్రహించాలి.
గతంలో వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను పొందగలిగారు. అందుకే 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ సీట్లలో వైసీపీ గెలవగలిగింది. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్నది. ఈ నాలుగేళ్లలో ప్రతి పక్షంగా తామెంత బలపడ్డారో టీడీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోడానికి ఇదే సరైన సమయం. జగన్ పరిపాలనను నిందిస్తూ జనంలోకి లోకేశ్ వెళితే ప్రయోజనం వుండదు. తాము మరోసారి అధికారంలోకి వస్తే … గతంలో చేసిన తప్పుల్ని రిపీట్ కానివ్వక పోవడంతో పాటు మంచి పాలన అందిస్తామనే నమ్మకాన్ని జనంలో కలిగించడం లోకేశ్‌కు సవాలే.
టీడీపీ గత పాలనకు, తిరిగి అధికారంలోకి వస్తే చేపట్టబోయే పాలనకు ఎలాంటి తేడా వుంటుందో వివరించాల్సి వుంటుంది. అది ప్రజామోదం పొందేలా వుండాలి. ఎందుకంటే మళ్లీ 2014 నాటి పాలనే అందిస్తామంటే జనానికి విసుగొస్తుంది. అది నచ్చకనే 2019లో ఘోరంగా ఓడించారని లోకేశ్ గుర్తించాలి. అనేక ప్రతికూల అంశాల మధ్య మొదలవుతున్న పాదయాత్ర… అధికారమనే గమ్యానికి చేర్చడంలో లోకేశ్ విజయం సాధిస్తారా? అనేది అతి పెద్ద ప్రశ్న.
టీడీపీ శ్రేణుల్ని తనతో పాటు అధికారం తీరానికి నడిపించడంపైనే లోకేశ్ సమర్థత ఆధారపడి వుంది. ఇప్పుడు విజయం సాధిస్తే…. ఆయన భవిష్యత్ బంగారు మయమే. లేదంటే రాజకీయ జీవితం పరిసమాప్తం. చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం లోకేశ్‌కు ఎదురైంది. పాదయాత్ర అంటే కేవలం కాలి నడక కాదు. ప్రధానంగా తన రాజకీయ నడత అని ఆయన గ్రహించాలి. టీడీపీతో పాటు తన రాజకీయ భవిష్యత్ పాదయాత్రపై ఆధారపడి ఉన్నాయని లోకేశ్ గుర్తెరగాలి. టీడీపీని పాల ముంచినా, నీట ముంచినా లోకేశే కారణం.
సొదుం రమణ