ఓవైపు చంద్రబాబు చేస్తున్న విమర్శల్ని తిప్పికొడుతూనే.. మరోవైపు ఆయన్ని మానసికంగా చావుదెబ్బ కొట్టేలా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. పదే పదే లోకేష్ ప్రస్తావన తెస్తూ చేతికి అందిరాని కొడుకు అంటూ బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారు. కొడాలి నాని అయినా, పేర్ని నాని అయినా, పార్టీలోకొచ్చిన వల్లభనేని వంశీ అయినా, కొత్తగా కండువా కప్పుకుంటున్న నేతలైనా.. ఎవరూ ఈ విషయంలో వెనక్కి తగ్గడంలేదు.
వీళ్లందరి టార్గెట్ ఒకటే.. బాబు చేసిన పనుల్ని గుర్తుకు తేవడం, లోకేష్ ఏ పనికీ పనికి రాడని భవిష్యత్ ని వర్ణించడం. ప్రధానంగా వైసీపీ నేతలంతా లోకేష్ అసమర్థతపైనే టార్గెట్ పెట్టారు. 70 ఏళ్లు పైబడినా వారసుడిపై నమ్మకంలేక చంద్రబాబు ఇంకా కష్టపడుతున్నారని పరోక్షంగా మాటలదాడి చేస్తున్నారు నేతలు. లోకేష్ గేర్ వేయలేరని, యాక్సిలరేటర్ తొక్కలేరని, అసలు బండే తీయలేడని.. అన్నారు వల్లభనేని వంశీ.
మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఏకంగా పార్టీలో సీక్రెట్ ఓటింగ్ పెట్టుకోవాలంటూ చంద్రబాబుకి సూచించారు. టీడీపీలో ఎవరూ లోకేష్ నాయకత్వం కోరుకోవడం లేదని అన్నారు. కొడాలి నాని, పేర్ని నాని.. రైతుల ఉచిత విద్యుత్ సబ్జెక్ పై మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టి.. లోకేష్ ని టార్గెట్ చేసి చంద్రబాబుకి నిద్రపట్టకుండా చేశారు. లోకేష్ విషయంలో వైసీపీ నేతలంతా ఒకే డైరక్షన్లో వెళ్తున్నట్టు అర్థమవుతోంది.
ఏ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టినా, చివర్లో లోకేష్ ని చేతగానివానిగా చిత్రీకరించి చంద్రబాబుపై మానసిక ఒత్తిడి పెంచడమే వారి టార్గెట్. వైసీపీ నేతల విమర్శలు చూస్తుంటే.. అటు టీడీపీలో కూడా విప్లవం వస్తుందేమోనన్న అనుమానం కలగక మానదు.
వాస్తవానికి టీడీపీలో ఎవరూ లోకేష్ నాయకత్వం కోరుకోవడం లేదు. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో చినబాబు అరంగేట్రం చేస్తే పార్టీ పాతాళానికి పడిపోవడం ఖాయం. మరోవైపు చంద్రబాబులో కూడా పట్టు సడలుతోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు వైసీపీ నేతలు. భవిష్యత్ ని వర్ణిస్తూ టీడీపీని వదిలి పారిపోయేలా భయపెడుతున్నారు. మొత్తానికి పక్కా ప్లాన్ ప్రకారం వైసీపీ నేతలు చినబాబు పేరుతో పెదబాబుని చికాకు పెడుతున్నారు.