సమీక్ష: జార్డ్ రెడ్డి
రేటింగ్: 2.5/5
బ్యానర్: మైక్ మూవీస్, త్రీ లైన్స్ సినిమాస్, సిల్లీ మాంక్ స్టూడియోస్
తారాగణం: సందీప్ మాధవ్, అభయ్, చైతన్య కృష్ణ, సత్యదేవ్, మనోజ్ నందం, తిరువీర్, శత్రు, ముస్కాన్ ఖూబ్‌చందని, దేవిక దఫ్తార్‌దర్ తదితరులు
కూర్పు: జె. ప్రతాప్ కుమార్
నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: సుధాకర్ యెక్కంటి
నిర్మాత: అప్పిరెడ్డి
రచన, దర్శకత్వం: జీవన్ రెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 22, 2019
''జీనా హైతో మర్‌నా సీఖో.. కదమ్ కదమ్ పర్ లఢ్‌నా సీఖో..'' అంటూ విద్యా సంస్థల ఆవరణలో వేళ్లూనుకుపోయిన ఆధిపత్య పోకడలని, అణచివేత ధోరణులని ధిక్కరించి, అణగదొక్కబడుతోన్న వారికి 'గొంతుక'గా మారిన చైతన్య స్ఫూర్తి జార్జ్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా, దేశవ్యాప్తంగా విద్యార్థి రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన జార్జ్ వ్యవహార శైలి, పోరాట తత్వం స్ఫూర్తిగా పలు పాత్రలని వెండితెరపై తీర్చిదిద్దారు. అయితే జార్జ్ రెడ్డి గురించి తెలియని వారికి తెలియజేస్తూ అతనికి అసలైన నివాళిగా అతని పేరు మీదే తెరకెక్కిన చిత్రమిది. పలు కారణాల వల్ల ఇందులోని సంఘటనలు, పాత్రలు కల్పితమన్నట్టు డిస్‌క్లెయిమర్ వేసారు కానీ జార్జ్ రెడ్డి గురించి గూగుల్ చేస్తే దొరికే ఇన్‌ఫర్మేషనే ఇందులోను వుంది.
కాకపోతే… ఒక బయోపిక్‌గా జార్జ్ రెడ్డి గురించి క్షుణ్ణమైన, అంతర్దృష్టితో కూడిన, కూలంకషమైన.. అవగాహన, సమాచారం దీనినుంచి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. గూగుల్ చేస్తే దొరికే సమాచారానికి మించి జార్జ్ రెడ్డి గురించిన సమగ్రమైన జ్ఞానాన్ని ఇవ్వడంలో దర్శకుడు జీవన్ రెడ్డి విఫలమయ్యాడు. జార్జ్ రెడ్డి ఒక స్ఫూర్తివంతమైన పర్సనాలిటీలా కాకుండా బుద్ధి బలం కంటే కండ బలాన్ని, ఆయుధాలని, హింసని నమ్మినవాడిలా చూపించారు. జార్జ్ రెడ్డి బాల్యం గురించి చూపించినపుడు కూడా అతనిలోని ఈ 'ఫైటర్' ధోరణినే హైలైట్ చేసారు. తనని గద్దించిన వారికి బుద్ధి చెప్పడానికి పిల్లవాడిగానే ఎలా వెనకాడలేదన్నది ఎస్టాబ్లిష్ చేసి, భగత్ సింగ్ లాంటి విప్లవకారుల స్ఫూర్తి వున్నట్టు చూచాయగా చెబుతారు. ఆపై జార్జ్ రెడ్డి యువకుడిగా పరిచయం కావడమే బస్సులో ఆడవాళ్లని వేధిస్తోన్న వారిని కొట్టి, తన పేరు బస్ సీట్‌పై ముద్ర వేస్తాడు. సగటు తెలుగు సినిమా హీరో తాలూకు ఇంట్రడక్షన్ సీన్ అది. దానిని ఇంకాస్త ఎక్స్‌టెండ్ చేస్తూ… ఆ ఫైట్‌కి ఫ్లాట్ అయిన హీరోయిన్ 'నువ్వు నడిపే బండీ రాయల్ ఎన్‌ఫీల్డూ… నీ చూపుల్లో వుందీ చెగువేరా ట్రెండు' అంటూ ఫక్తు ఐటెమ్ సాంగ్ లాంటిది కూడా పాడేస్తుంది!
కమర్షియల్ అప్పీల్ కోసం ఇదో చిన్న వికర్షణలా ఇది అనిపిస్తుంది కానీ ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు గడిచిన తర్వాత ఇది 'జార్జ్‌రెడ్డి' పేరుతో వచ్చిన బయోపిక్ కాదని, ఆ పేరు వాడుకున్న కమర్షియల్ ఫార్ములా చిత్రమని బోధ పడుతుంది. ఎందుకంటే అసలు జార్జ్‌రెడ్డిలోని ఆ ఆగ్రహావేశాలు ఎందుకు పుట్టాయి? సమాజంలోని అసమానతల పట్ల అతనిలో రగిలిన విప్లవానికి నాంది ఎక్కడ పడింది? ఏ కారణాల చేత విశ్వవిద్యాలయంలోని విద్యార్థి రాజకీయాలకి ఎదురు నిలిచి తానో శక్తిగా ఎదగాలని నిశ్చయించుకున్నది? లాంటి వాటికి ఎక్కడా క్లారిటీ ఇచ్చే సన్నివేశాలుండవు. 'ఇతనో రెబల్ అనేది మీకు తెలిసిన సంగతే కనుక ఇతనిలా ప్రవర్తిస్తాడు అనుకోండి' అన్నట్టుంటుంది చాలా సందర్భాలలో దర్శకుడి ధోరణి. సమస్య ఏదయినా పిడిగుద్దులు గుద్దుతూ మీద పడిపోయినట్టు చూపించడం జార్జ్ రెడ్డి అకడెమిక్ ఎక్సలెన్స్‌కి, బుద్ధి సూక్ష్మతకి, చైతన్యానికి, అన్నిటికీ మించి అతనిలోని నాయత్వ లక్షణాలకి అన్యాయం చేసినట్టనిపిస్తుంది.
విద్యార్థి సంఘాల మధ్య గొడవలు 'స్లో బర్న్'లా చూపిస్తే సినిమాటిక్‌గా ఎఫెక్టివ్‌గా వుండేది. ఆరంభంలోనే విద్యార్థులు ఒకరిపై ఒకరు కలబడి కొట్టేసుకోవడంతో ఇటు కథానాయకుడిలో ఆవేశం రగలడానికి తగిన కారణాలు చూపించడానికి వీలు లేకపోయింది అలాగే అటు కథ ముందుకి సాగే కొద్దీ ఆ గొడవలు రొటీన్‌గా మారిపోయి బోర్ కొట్టించేసింది. చాలా సన్నివేశాల్లో ముందు, వెనకలు లేకపోవడం వల్ల కథనం సాఫీగా సాగుతోన్న భావన కలగకపోగా ఒక విధమైన గందరగోళం నెలకొంటుంది. ఉదాహరణకి… జార్జ్ రెడ్డి స్పీచ్ ఇచ్చే ముందు సన్నివేశంలోనే ఏ ఒక్కరూ కదిలి రావడం రావడం లేదనే అసహనాన్ని అతని స్నేహితులలో చూపించి, అంతలోనే అయిదు వేల మంది హాజరయ్యారనే ఆశ్చర్యాన్ని అతని వైరి బృందం వ్యక్తం చేయడంతో ఆ సన్నివేశం ఓపెన్ చేస్తారు. అంత వరకు కదిలిరాని వారు ఒకేసారి అన్ని వేల మంది ఎలా వచ్చేసారు? స్పీచ్ ఇచ్చేది జార్జ్ రెడ్డి కాబట్టి వచ్చేసి ఉంటారులే అనుకోవాలా? ఇలాంటి గ్లేరింగ్ మిస్టేక్స్ వల్ల, 'ఇల్ ఇన్‌ఫార్మ్‌డ్'గా ఆడియన్స్‌ని వుంచేయడం వల్ల చాలా సన్నివేశాల్లోకి డిస్‌ట్రాక్షన్ చొరబడింది.
అలాగే జార్జ్ రెడ్డి ఎవరిపై అయితే పోరాడుతున్నాడనే దానిపై బహుశా రాజకీయ ఒత్తిళ్ల వల్ల డీటెయిల్స్ ఇవ్వలేదేమో కానీ అది గందరగోళాన్ని మరింత పెంచడానికి కారణమయింది. ఈ కారణం వల్లే జార్జ్ రెడ్డి క్యారెక్టర్ ఫైట్‌తో, ఎమోషన్‌తో, ప్యాషన్‌తో కనక్ట్ అయ్యే వీలు కూడా లేకపోయింది. జార్జ్ రెడ్డి జీవితం ఎలా ముగిసిందనేది తెలిసిన సంగతి కనుక సదరు సన్నివేశం పండాలన్నా, కదిలించాలన్నా కూడా ఆ పాత్రని ప్రేమించేలా తీర్చి దిద్దగలగాలి. ఎమోషనల్‌గా ఎంత కనక్ట్ చేయగలిగితే అంతగా అతని ముగింపు అంతగా కదిలించగలుగుతుంది. యాక్షన్ సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌పై పెట్టకపోవడంతో సినిమా పూర్తయ్యే సరికి జార్జ్ రెడ్డి కాకుండా ఫైర్ బాల్ ఫైట్, బ్లేడ్ ఫైట్ లాంటివే గుర్తుంటాయి. వాటి గురించే ప్రత్యేకించి మాట్లాడుకునేలా చేస్తాయి. యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకోవాలంటే సగటు కమర్షియల్ సినిమా చాలు కదా. బయోపిక్‌లో వ్యక్తి గురించిన గొప్పతనాన్ని కాకుండా ఫైట్ సీన్స్ గురించి మాట్లాడుకునేట్టయితే ఇక ఆ సినిమా తీసిన పర్పస్ ఎంతమేరకు సాధించినట్టు?
సందీప్ మాధవ్ తన పాత్రలో నమ్మశక్యంగా అనిపించాడు. తనవంతు న్యాయం కూడా చేసాడు. సహ నటుల్లో అభయ్ తనకి దొరికిన సదవకాశాన్ని వినియెగించుకున్నాడు. చైతన్య కృష్ణ ఎప్పటిలానే ప్రభావం చూపించాడు. లలన్‌గా తిరువీర్ అవమానభారాన్ని బాగా అభినయించాడు. మనోజ్, శత్రు కూడా తమకిచ్చిన పాత్రల్లో మెప్పించారు. ముస్కాన్ సెవెంటీస్ స్టయిలింగ్‌తో చూడ్డానికి బాగానే వుంది కానీ పర్‌ఫార్మెన్స్ పరంగా జస్ట్ ఓకే అనిపిస్తుందంతే.
హర్షవర్ధన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణ కాగా, సుధాకర్ ఛాయాగ్రహణం కట్టి పడేస్తుంది. ఫైట్ మాస్టర్స్‌కి కూడా ప్రశంసలు దక్కుతాయి. ఎడిటింగ్ మాత్రం అస్తవ్యస్తంగా వుంది. చిన్న సినిమా అయినా కానీ ఖర్చు పరంగా వెనుకాడలేదు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తీసిన పర్పస్ అయితే సాల్వ్ అవలేదు. స్టయిలిష్ టేకింగ్‌తో యాక్షన్ సన్నివేశాలని అద్భుతంగా తీస్తాడని అనిపించాడే కానీ జార్జ్ రెడ్డి సోల్‌ని తెరపై ఆవిష్కరించడంలో కానీ, ఆ పాత్ర తాలూకు ఫీల్‌ని ప్రేక్షకులు క్యారీ చేసేలా చేయడంలో కానీ అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఈ కథని చెప్పడానికి 'మహానటి'లో ఎంచుకున్న స్క్రీన్‌ప్లే సాధనం (సమంత ట్రాక్) మాదిరిగా ఎవరో అతని గురించిన సమాచారం సేకరిస్తున్నట్టు చూపించినా కానీ అదీ ప్రభావవంతంగా తెరపైకి తీసుకురాలేదు.
స్టూడెంట్ యూనియన్ గొడవలు, విద్యార్థి రాజకీయాలు నేపథ్యంలో గతంలో చాలా చిత్రాలొచ్చాయి. అయితే ఒక విద్యార్థి నాయకుడి బయోపిక్ అయి వుండీ ఈ చిత్రం సదరు రెగ్యులర్ క్యాంపస్ పాలిటిక్స్‌కి సంబంధించిన సినిమాని మించి ముద్ర వేయలేకపోయింది. అన్నిటికంటే బాధాకరం ఏమిటంటే… జార్జ్ రెడ్డి లాంటి పాత్ర చైతన్యం రగిలించడం సంగతి అటుంచి కనీసం ఎమోషనల్‌గా కూడా కనక్ట్ కాలేకపోయింది. ఇంకా దారుణం ఏమిటంటే… జార్జ్ రెడ్డి తర్వాత అతని స్ఫూర్తి విద్యార్థి సంఘాలని ఎంత ప్రభావితం చేసింది, విద్యార్థి రాజకీయాలపై అతను వేసిన ముద్ర ఏమిటి లాంటి వాటి గురించి కనీస ప్రస్తావన కూడా లేకుండా ఎండ్ అయిపోయింది.
బాటమ్ లైన్: అసంపూర్ణ నివాళి!
– గణేష్ రావూరి