ఇప్పుడు వీళ్లు బిడ్డల్లా కనిపించట్లేదా కేసీఆర్!

తెలంగాణ ఉద్యమం టైమ్ లో ఆర్టీసీ కార్మికులంతా వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాల్ని ఫణంగా పెట్టారు. అప్పుడు వీళ్లంతా కేసీఆర్ కు బిడ్డల్లా కనిపించారు. ఇప్పుడు మరో డిమాండ్ కోసం రోడ్డెక్కిన…

తెలంగాణ ఉద్యమం టైమ్ లో ఆర్టీసీ కార్మికులంతా వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాల్ని ఫణంగా పెట్టారు. అప్పుడు వీళ్లంతా కేసీఆర్ కు బిడ్డల్లా కనిపించారు. ఇప్పుడు మరో డిమాండ్ కోసం రోడ్డెక్కిన కార్మికులు మాత్రం కేసీఆర్ కు బిడ్డల్లా కనిపించడం లేదు. తేడా ఒక్కటే. కార్మికులు అలానే ఉన్నారు, కేసీఆర్ మాత్రం ఉద్యమనాయకుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు.

ప్రతి రంగంలో సమస్యలు ఉంటాయి. వాటిని తీర్చడం కోసమే కేసీఆర్ ను ప్రజలు ముఖ్యమంత్రిని చేర్చారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నో జటిలమైన సమస్యల్ని దూదిపిందె ఊదేసినట్టు ఊదేశారు కేసీఆర్. ఎంతో కష్టం అనుకున్న సమస్యల్ని చిటికెలో పరిష్కరించారు. ఉదాహరణకు తెలంగాణ ఏర్పడిన కొత్తలో విద్యుత్ సమస్యనే తీసుకుంటే.. ప్రజలంతా ఎంతో భయటపడ్డారు. కేసీఆర్ మాత్రం ఎలాంటి కష్టం కలగకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రజా సమస్యగా ఎందుకు చూడడం లేదనేదే ప్రశ్న.

ఎన్నో వర్గాలకు అడగకుండా వరాలిచ్చిన ముఖ్యమంత్రి, ఆర్టీసీ కార్మికుల విషయంలో మాత్రం ఇంత నిర్దయగా ఉండడాన్ని కొన్ని వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎలాగూ కార్మికులు తగ్గారు. ప్రభుత్వంలో విలీనం అంశాన్ని పక్కనపెట్టారు. కనీసం ఇలాంటప్పుడైనా మిగతా డిమాండ్ల గురించి ఆలోచించొచ్చు కదా. ఇప్పటికీ కేసీఆర్ మనసులో ప్రైవేటీకరణ ఆలోచనే. సగం రూట్లను ఎలా ప్రైవేట్ పరం చేయాలనే తంత్రమే.

ఆర్టీసీ కార్మికులు అన్ని మెట్లు దిగిన తర్వాత వాళ్లను భేషరతుగా విధుల్లోకి తీసుకొని ఉంటే కేసీఆర్ గొప్పోడు అయ్యేవాడు. అందరి దృష్టిలో హీరోగా నిలిచేవాడు. కానీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆర్టీసీని నడపాలంటే నెలకు 640 కోట్లు కావాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 5100 రూట్ల ప్రైవేటీకరణపై ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామంటూ కార్మికుల ఉద్యోగాల్ని గాల్లో దీపాలుగా మార్చేశారు.

సమ్మెకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడేం కొత్తగా కష్టాలు ముంచుకురాలేదు. కేసీఆర్ తలుచుకుంటే కార్మికుల జీవితాల్ని సెటిల్ చేయగలరు. ఆర్టీసీకి ఇప్పటికే ఉన్న 5వేల కోట్ల అప్పుల్ని ఓ కొలిక్కి తీసుకురావడం ముఖ్యమంత్రికి పెద్ద సమస్య కాదు. కానీ ఆర్టీసీని యథావిధిగా నడపడం కేసీఆర్ కు ఇష్టంలేదు. అందుకే ఈ కాలయాపన. 

ఆర్టీసీని ఏం చేయబోతున్నామనే విషయంపై ఇప్పటికే పరోక్షంగా సంకేతాలిచ్చింది ప్రభుత్వం. ఈరోజు కోర్టు నుంచి తీర్పు రావాలనేది కేవలం ఓ సాకుగా మాత్రమే కనిపిస్తోంది. ఉద్యోగులకు మేలు చేస్తామంటే కోర్టు వద్దంటుందా?