కౌన్ బనేగా సీఎం.. ఒప్పందం కుదిరినట్టే!

ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది మహారాష్ట్ర రాజకీయం. బీజేపీతో తెగదెంపులు చేసుకుని సీఎం పీఠమే లక్ష్యంగా ముందుగా సాగుతూ ఉంది శివసేన. అయితే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీ…

ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది మహారాష్ట్ర రాజకీయం. బీజేపీతో తెగదెంపులు చేసుకుని సీఎం పీఠమే లక్ష్యంగా ముందుగా సాగుతూ ఉంది శివసేన. అయితే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నా, ఎన్సీపీ మాత్రం ఝలక్ లు ఇస్తూ ఉంది. అయితే ఎట్టకేలకూ కూటమి ఒప్పందం కుదిరినట్టే అని ప్రస్తుతం ఒక ప్రచారం షురూ అయ్యింది.

దాని ప్రకారం ముఖ్యమంత్రి పీఠం శివసేనకు, కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి అని ప్రచారం సాగుతూ ఉంది. ఐదేళ్లూ శివసేన అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉంటారనేది ఈ ఒప్పందం నియమం అట. అయితే ఐదేళ్లు ఈ ప్రభుత్వం నిలబడుతుందా? అనేది ఒక సందేహం.

ఆ సంగతలా ఉంటే.. శివసేన కలల పంట సీఎం పదవి దానికే దక్కినా.. ఆ హోదాలోఎవరు కూర్చుంటారు? అనేది ఆసక్తిదాయకంగా మారింది. తొలి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి కావొచ్చు అనేది ఒక అంచనా.

అయితే మరీ అంత యంగ్ పొలిటీషియన్ ను కూర్చోబెట్టి అజిత్ పవార్ వంటి ఎన్సీపీ సీనియర్, చౌహాన్ లాంటి కాంగ్రెస్ మాజీలు చేతులు కట్టుకుని కూర్చుంటారా? అనేది ప్రశ్నార్థకమే. అందుకే ఉద్ధవ్ ఠాక్రేను సీఎంగా కూర్చోబెట్టాలనేది కాంగ్రెస్, ఎన్సీపీల ఆలోచన కావొచ్చు.

అయితే ఠాక్రేలు కాకుండా సంజయ్ రౌత్ కూడా సీఎం రేసులో ఉన్నారని శివసేన వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఠాక్రేలు కాకుండా మరెవరు సీఎంగా కూర్చున్నా శివసేనను బీజేపీ చీల్చగలదు అనే అనుమానాలూ ఆ పార్టీ వర్గాల నుంచినే వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం!