నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తులు టీడీపీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మా తాత పార్టీ అంటూ తగుదునమ్మా అనుకొని వచ్చే పరిస్థితి లేదు. నందమూరి కుటుంబం నుంచి ఏ ఒక్కరికీ ప్రాధాన్యం దక్కకుండా చేయడంలో చంద్రబాబు వందశాతం సక్సెస్ అయ్యారు. మరీ ముఖ్యంగా కొడుకు లోకేష్ ను పెద్దదిక్కుగా మార్చేందుకు, నందమూరి కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తిని ఆయన ఎదగనివ్వరు.
ఈ మొత్తం ప్రహసనంలో బాలకృష్ణ ఒక్కరూ మినహాయింపు. ఎందుకంటే, చంద్రబాబు బావకు ఎదురుతిరిగే రకం కాదు బాలయ్య. ఎలాంటి పదవులు ఆయనకు అక్కర్లేదు. పైగా పిల్లనిచ్చాడు. కాబట్టి బాలకృష్ణ ఎలాగోలా పార్టీలో నెట్టుకొచ్చేస్తున్నాడు. మిగతా నందమూరి నాయకులకు మాత్రం అంత సీన్ లేదు. వాడుకొని వదిలేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారనే విషయాన్ని వీళ్లంతా ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. నందమూరి కుటుంబం నుంచి చైతన్యకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. జయకృష్ణ కొడుకుగా, పెద్ద ఎన్టీఆర్ మనవడిగా తనకున్న ప్రత్యేక హక్కుతో పార్టీలోకి వచ్చి కీలకంగా మారాలనేది చైతన్యకృష్ణ ఆలోచన. అంతాబాగానే ఉంది కానీ, టీడీపీలో నందమూరి వారసులకు చోటుందా అనే ప్రశ్నను చైతన్యకృష్ణ తనకుతానుగా వేసుకుంటే బాగుంటుంది.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొన్నటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎవ్వర్నీ పార్టీలో ఉండనివ్వలేదు చంద్రబాబు. మెల్లమెల్లగా వెన్నుపోటు పొడుస్తూ పెద్ద ఎన్టీఆర్ ను ఎలా పదవీచ్యుతుడ్ని చేశారో అందరికీ తెలిసిందే. దాని గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. ఇక హరికృష్ణను పార్టీ నుంచి ఎలా సైడ్ చేశారనే విషయం కూడా తెలిసిందే. చివరికి ఆయన మరణాన్ని కూడా రాజకీయ చేశారు చంద్రబాబు. ఆఖరి నిమిషయంలో హరికృష్ణ కుమార్తెను తెరపైకి తెచ్చి,ఆ విధంగా కూడా తన రాజకీయాలకు వాడుకున్నారు.
ఇక ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని ఎలా అణగతొక్కారో అంతా చూశాం. బాబు అరాచకాలు భరించలేక ఆవిడ ఏకంగా సొంత పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో సేఫ్ గా ఉన్నారు. గతంలో బాబు ఏం చేశారో ఎప్పటికప్పుడు లక్ష్మీపార్వతి బయటపెడుతూనే ఉన్నారు.
ఇవన్నీ ఒకెత్తు, జూనియర్ ఎన్టీఆర్ మరో ఎత్తు. పార్టీలో కీలకంగా మారుతున్నాడనుకున్న టైమ్ లో జూనియర్ ను చంద్రబాబు ఎలా తప్పించారో అందరం చూశాం. ఒక దశలో ఎన్టీఆర్, పార్టీ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేకపోయారంటే బాబు దెబ్బ ఏ రేంజ్ లో పడిందో చూసుకోవచ్చు. ప్రస్తుతం జూనియర్ మాటెత్తితే అంతెత్తున లేచి పడుతున్నారు బాబు.
ఇన్ని అనుభవాలు, ఘటనలు కళ్లముందు పెట్టుకొని మరీ పార్టీలోకి రావడానికి తహతహలాడుతున్నాడు చైతన్యకృష్ణ. పైగా మునిగిపోయే నావలా టీడీపీ మారిన ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీలోకి రావాలని అనుకోవడం ఆశ్చర్యం. మొత్తమ్మీద బాబుకు మరొకరు బలవ్వడానికి రెడీ అంటూ పార్టీలో అంతా చెవులు కొరుక్కుంటున్నారు.