సినిమాలు సూడట్లేదేటి బాబూ

తెలుగు నాట సినిమాలు, రాజకీయాలు వేరు వేరు కాదు. వ్యవహారాలు కూడా అలాగే వుంటాయి. సినిమాల సంగతి చూడండి. విడుదల ముందు నానా హడావుడి వుంటుంది. ఓ లెవెల్ లో పబ్లిసిటీ వుంటుంది. ఇంకేం…

తెలుగు నాట సినిమాలు, రాజకీయాలు వేరు వేరు కాదు. వ్యవహారాలు కూడా అలాగే వుంటాయి. సినిమాల సంగతి చూడండి. విడుదల ముందు నానా హడావుడి వుంటుంది. ఓ లెవెల్ లో పబ్లిసిటీ వుంటుంది. ఇంకేం లేదు కుమ్మేస్తుంది అనుకుంటారు ఈ హడావుడి అంతా చూసి. కానీ తీరా విడుదలయ్యాక తెలుస్తోంది. కంటెంట్ వీక్ అని. మరి ఇంత హడావుడి ఏంటీ అంటే పబ్లిసిటీ మాహత్యం. మరి అంత పబ్లిసిటీ చేసారు కదా, జనం బుట్టలో పడలేదా? అంటే వాళ్లకి తెలుసు కదా ఏ సినిమా సత్తా ఏపాటిదో?

తెలుగుదేశం పార్టీ ది ఇలాంటి వ్యవహారమే. పబ్లిసిటీ ఎక్కువ. కంటెంట్ వీక్. పార్టీని భుజాన వేసుకుని మోసే మీడియా సంస్థలు వుండనే వున్నాయి. అవి అలా క్షణ..క్షణ టముకేస్తూనే వుంటాయి. కానీ తెలుగు నాట మీడియాను చూసే ప్రతి ఒక్కరికీ…పక్కాగా ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏ పత్రిక ఏ పార్టీదో, ఏ ఛానెల్ ఏ పార్టీ చంకలో దూరుతుందో. అందుకే సింపుల్ గా లైట్ తీసుకుంటారు. 

అందువల్ల ఆ రెండు చానెళ్లు, ఆ రెండు పత్రికలు కిందా మీదా అయిపోవడమే తప్ప ఫలితం రావడం లేదు. ఎందుకంటే  ఆ నాలుగింటిని కలిపి తెలుగుదేశం పార్టీ ఆఫీసు పెరట్లో జనాలు ఎప్పుడో కట్టేసారు. పార్టీనీ వాటినీ వేరు చేసి చూడలేరు. అవి ఎంత యాగీ చేసినా, వాటిని నమ్మేది తెలుగుదేశం జనాలు తప్ప మరొకరు కాదు. అందువల్ల వాటి వల్ల వచ్చే ఓట్లు అదనంగా ఒక్కటి కూడా వుండదు. అవి అంతలా చాకిరీ చేయకపోయినా అవే ఓట్లు, చేసినా అవే ఓట్లు.

పైగా ఈ నాలుగూ కలిసి చేసే యాగీ వల్ల జగన్ కు మరింత ప్లస్ అవుతోంది తప్ప మైనస్ కావడం లేదు. అవి రాసే జోకుల్లాంటి అభూతకల్పన వార్తలు చూసి జనం నవ్వుకోవడం మాట దేవుడెరుగు, తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేసుకుంటున్నారు. భాజపా అండ కోసం అర్రులు చాస్తోందని, జనసేనతో పొత్తు కోసం కిందా మీదా అయిపోతోందని క్లారిటీ వచ్చేస్తోంది. ఇలాంటి వీక్ పార్టీనా తెలుగుదేశం అని ఫిక్స్ అయిపోయేలా చేస్తున్నాయి ఆ నాలుగు మీడియాలు కలిసి.

ఓ పక్క వైకాపా గెలుపు మాటలు వినిపిస్తున్నా, తెలుగుదేశం ప్రభంజనం అంటూ అడ్డగోలుగా శీర్షికలు పెట్డడం వల్ల సాధిస్తున్నదేమిటి? ఆ పార్టీని మరింత పలుచన చేయడం తప్ప. ముందుగానే ఏదో అన్యాయం జరిగిపోతోందని గోల పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ వీక్ అనే సందేశాలను పంపిస్తున్నారు తప్ప మరోటి సాధించడం లేదు. 

మొత్తం మీద ఇలాగే ఈ  నాలుగూ శల్య సారధ్యం చేస్తున్నంతకాలం, బాబుగారి, ఆయన పార్టీ బలహీనతలను చెప్పనంత కాలం, ఆ పార్టీకి చేటు చేయడం తప్ప మేలు చేయడం వీళ్ల వల్ల కాదు. సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్ లు పెట్టుకున్నట్లు, ఓడిపోయిన తరువాత కూడా సాకులు వెదుక్కుని వార్తలు వండి వార్చడం తప్ప ఈ మీడియా చేసే మేలు లేదు.