రజనీకాంత్‌, కమల్‌హాసన్‌.. నిజంగానే కలుస్తారా.?

తమిళనాడ రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ అగ్రహీరోలు. రాజకీయ రంగంలోకి రావడంపై కమల్‌ హాసన్‌ అనూహ్యంగా నిర్ణయం తీసుకుంటే.. ఏళ్ళ తరబడి రాజకీయ రంగ ప్రవేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు రజనీకాంత్‌. ఈ ఇద్దరి అభిమానుల మధ్యా…

తమిళనాడ రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ అగ్రహీరోలు. రాజకీయ రంగంలోకి రావడంపై కమల్‌ హాసన్‌ అనూహ్యంగా నిర్ణయం తీసుకుంటే.. ఏళ్ళ తరబడి రాజకీయ రంగ ప్రవేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు రజనీకాంత్‌. ఈ ఇద్దరి అభిమానుల మధ్యా చాలాకాలంగా విభేదాలున్నాయి. రజనీకాంత్‌ని కమల్‌ అభిమానులు ట్రోల్‌ చేయడం.. రజనీకాంత్‌ అభిమానులు, కమల్‌ని ట్రోల్‌ చేయడం సర్వసాధారణమే. అయితే, ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరి మధ్యా స్నేహ బంధం చిగురిస్తోంది.

మొన్నీమధ్యనే, కమల్‌ హాసన్‌తో రాజకీయంగా కలిసి పనిచేసే అవకాశాలు లేకపోలేదంటూ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్‌ సైతం, తానూ రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. వాస్తవానికి, కమల్‌ రాజకీయాల్లోకి వస్తూనే రజనీకాంత్‌ మీద సెటైర్లు వేశారు. ఆయన పబ్లిసిటీ కోసమే పనిచేస్తారనీ, రాజకీయాల్లో అలాంటి పనులు కుదరవనీ రజనీకాంత్‌పై కమల్‌ వేసిన సెటైర్లు అప్పట్లో పెను దుమారం రేపాయి.

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! ఏమో, రజనీకాంత్‌ – కమల్‌ రాజకీయాల్లో కలిసి పని చేయబోతున్నారేమో. ఇదిలా వుంటే, రజనీకాంత్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2021లో తమిళ ప్రజలు పెద్ద మార్పుని చూపించబోతున్నారన్నది రజనీకాంత్‌ వ్యాఖ్యల సారాంశం. ఆ అద్భుతం రజనీకాంత్‌ పెట్టబోయే పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందా.? లేదంటే, కమల్‌ హాసన్‌ని ఆయన కలుపుకోవడం ద్వారా సాధ్యమవుతుందా.? అన్నది తేలాల్సి వుంది.

నిజానికి, రజనీకాంత్‌కి తమిళనాడులో బీభత్సమైన ఫాలోయింగ్‌ వుంది. అలాగని, ఆ సినీ ఫాలోయింగ్‌, ఓట్లను గుమ్మరిస్తుందా.? అంటే, 'రజనీకాంత్‌ నాన్‌ లోకల్‌' అనే విమర్శ వుంది గనుక.. అది అతనికి అంత సులువైన వ్యవహారం కానే కాదు. తెలుగు నాట చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లో ఏం సాధించారో చూశాం. ఆ లెక్కన, రజనీకాంత్‌ అంత అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వచ్చేస్తారా.?

అందుకే, అన్నీ ఆలోచించి.. కమల్‌ హాసన్‌తో కలిసి రాజకీయ ప్రయాణం చేయాలనే నిర్ణయానికి రజనీకాంత్‌ వచ్చినట్లు కన్పిస్తోంది. కానీ, కమల్‌ హాసన్‌ భావాలకీ, రజనీకాంత్‌ భావాలకీ పొంతన కుదరడం కూడా అంత ఈజీ కాదు. చూద్దాం.. 2021 నాటికి పరిస్థితులు అనుకూలించి, ఈ ఇద్దరూ రాజకీయంగా ఒక్కటవుతారో లేదో.!