దేవినేని అవినాష్.. తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పనిచేసి, ఇటీవల ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం విదితమే. నిజానికి, గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించినప్పుడే దేవినేని అవినాష్ సన్నిహితులు, అభిమానులు.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినదించారు. అయితే, లోకేష్ బుజ్జగింపుల నేపథ్యంలో దేవినేని అవినాష్ అప్పటికి అలా సరిపెట్టుకున్నారు.
ఇక, గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు దేవినేని అవినాష్‌కి అస్సలేమాత్రం సహకరించలేదనీ, ఆ మాటకొస్తే అధినేత చంద్రబాబు కూడా దేవినేని అవినాష్‌ని లైట్ తీసుకున్నారనీ అప్పట్లో ఊహాగానాలు విన్పించాయి. కారణాలేవైతేనేం, దేవినేని అవినాష్ అయిష్టంగానే గుడివాడలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడాయన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరుతూనే, తన సొంత అడ్డా అయిన విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతల్ని దేవినేని అవినాష్ దక్కించుకోవడం గమనార్హం.
పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా అన్ని విధాలా అండగా వుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దేవినేని అవినాష్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. వైసీపీ శ్రేణులే కాదు.. టీడీపీ అనుకూల మీడియా కూడా చెబుతోంది. ఇక, తన మీద టీడీపీ చేస్తున్న విమర్శలకి దేవినేని అవినాష్ కాస్త సుతిమెత్తగానే అయినా సరైన సమాధానమే ఇస్తున్నారు.
''నేను టీడీపీని వాడుకోలేదు.. నన్నే టీడీపీ వాడుకుంది.. చంద్రబాబుని నమ్మి మేం (దేవినేని అవినాష్ తన తండ్రితో కలిసి టీడీపీలో చేరడం, ఆ తర్వాత అనారోగ్యంతో దేవినేని నెహ్రూ కన్ను మూయడం.. ఈ క్రమంలో దేవినేని అవినాష్‌ని తన సొంత సోదరుడిలా చూసుకుంటానని లోకేష్ చెప్పడం తెల్సిన విషయాలే) తెలుగుదేశం పార్టీలో చేరాం.. కానీ, గుడివాడకు నన్ను బలవంంగా పంపించారు. అయినా, నేను పార్టీకి ఎదురు చెప్పలేదు. నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నాకు సహకరించలేదు'' అని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు.
''ఇంత జరిగాక కూడా నేను టీడీపీని వీడాలనుకోలేదు.. కానీ, టీడీపీ నేతలే కొందరు నాకు పొగపెట్టే ప్రయత్నం చేశారు..'' అంటూ దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, కొడాలి నాని అయితే.. దేవినేని అవినాష్‌ని టీడీపీ తన మీద పోటీకి దింపి బలిపశువుని చేసిందని ఇప్పటికే ఆరోపించిన విషయం విదితమే.