పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓ గురువుగారు వున్నారని, కేవలం ఆయనకే కాదు త్రివిక్రమ్..ఇంకా చాలా మంది సినిమా సెలబ్రిటీలకు ఆయన గురువు అని టాలీవుడ్ లో వినిపిస్తూ వుంటుంది.
ఏటా సంక్రాంతికి మొదలుపెట్టి శివరాత్రి వరకు ఆయన వెస్ట్ గోదావరిలోని తన స్వంత ఊరులో వున్న నారసింహ ఆలయం దగ్గర భారీగా హోమాలు నిర్వహిస్తారు. శివరాత్రి నాడు అత్యంత భారీగా పూర్ణాహుతి కూడా జరుగుతుంది. మొత్తం వీటన్నింటికి కోట్లు ఖర్చు అవుతాయని చెప్పుకుంటారు.
ఈ ఏడాది కూడా ఈహోమాలు మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే ఈసారి విశేషమేమిటంటే, మాఘమాసం తొలినాళ్లలో చేసే రాజశ్యామలయాగాన్ని కూడా చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కు అధికార ప్రాప్తి కోసం దీన్ని తలపెట్టారని భోగట్టా. పవన్ నారసింహ క్షేత్రాల పర్యటన కార్యక్రమాన్ని కూడా సదరు గురువుగారే సూచించారని, దాన్నే పవన్ తూ చ తప్పకుండా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ రాజశ్యామల యాగం అన్నది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కేసిఆర్ తరచు ఈ యాగం చేస్తుంటారు. జగన్ కోసం విశాఖలో ఇదే యాగం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కోసం జరుగుతోంది. మరి చంద్రబాబు కోసం ఎవ్వరూ చేస్తున్నట్లు వార్తలు వినిపించడం లేదు.
అయినా పది లేదా పాతిక కాకుంటే యాభై సీట్లలో పోటీ చేస్తే ఎంత యాగం ఫలితాన్ని ఇచ్చినా అధికారం ఎలా వస్తుందో?